Income tax: వార్షికాదాయం రూ.12 లక్షలు దాటిందా..? ఈ టిప్స్ పాటిస్తే నో ట్యాక్స్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో ఆదాయపు పన్నుచెల్లింపు దారులకు శుభవార్త చెప్పింది. పన్ను మినహాయింపును గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.12 లక్షల వరకూ ఆదాయం సంపాదించే వారిపై పన్ను భారాన్ని తగ్గించింది. దీంతో సగటు వేతన జీవులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాలు, ఖర్చుల నేపథ్యంలో ఇది మధ్యతరగతి జీవులందరికీ ఊరట కల్పించే విషయం. అయితే రూ.14.65 లక్షల వార్షిక ఆదాయం సంపాదించే వారు కూడా ఆదాయపు పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రప్రభుత్వం 2025-26 యూనియన్ బడ్జెట్ లో రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇతర ఆదాయపు పన్ను నిబంధనలు సరిగ్గా వినియోగించుకుంటే రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏడాదికి రూ.14.65 లక్షల కాస్ట్ టు కాస్ట్ కంపెనీ (సీటీసీ) సంపాదిస్తుంటే, ఎన్పీఎస్, ఈపీఎఫ్ చందాలు కడుతూ ఉంటే ఈ అవకాశం ఉంటుంది. కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో రూ.75 వేలు ప్రామాణిక మినహాయింపు, రూ.25 వేలు కుటుంబ పెన్షన్ కింద మినహాయింపు, ఎన్పీఎస్ సహకారం 14 శాతం, ఈపీఎఫ్ సహకారం 12 శాతం ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రూ.14.65 లక్షల సీటీసీ జీతం ఉన్న ఉద్యోగులు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక జీతం రూ.14,65,000 అనుకోండి. మూలవేతనంగా దానిలో సగం రూ.7,32,500 లెక్కిస్తారు. కొత్త పన్ను విధానం ప్రకారం రూ.75 వేల ప్రామాణిక మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్ సహకారంగా ప్రాథమిక వేతనంలో 12 శాతం అంటే రూ.87,900 లెక్కిస్తారు. ఎన్పీఎస్ చందాగా 14 శాతం అంటే రూ.1,02,550 ఉంటుంది. దీంతో పన్ను విధించే ఆదాయం రూ.11,99,550కి చేరుకుంటుంది. రూ.12 లక్షల వరకూ మినహాయింపు ఉంది కాబట్టి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందటానికి తప్పనిసరిగా ఎన్ఫీఎస్, ఈపీఎఫ్ చందాలు చెల్లిస్తూ ఉండాలి.
జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్పీఎస్) అనేది ప్రభుత్వ మద్దతులో కూడిన పదవీ విరమణ పథకం. మార్కెట్ లింక్డ్ పథకమైన దీనితో కొన్ని పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈపీఎఫ్ అంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్. జీతంలో సుమారు 12 శాతాన్ని కట్ చేసి, దీనిలో చందాగా జమచేస్తారు. దీని వల్ల కూడా పలు ప్రయోజనాలు లభిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








