AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Tickets: విమాన ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. పెరగనున్న టిక్కెట్ల ధరలు

ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు సంఖ్య పెరిగింది. డబ్బు కంటే కాలం విలువైనదని నమ్మే చాలా మంది తమ అవసరాలకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే విమాన ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు. విమానయాన రంగంలో పెరిగిన పోటీ కారణంగా చాలా కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతో ట్రైన్ టిక్కెట్ ధరలోనే చాలా మంది విమాన ప్రయాణాన్ని ఆశ్వాదిస్తున్నారు. అయితే విమాన ప్రయాణికులకు షాక్ తగలనుంది. ట్యాక్స్ పెంపు కారణంగా టిక్కెట్ల రేట్లు పెరగనున్నాయి.

Flight Tickets: విమాన ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. పెరగనున్న టిక్కెట్ల ధరలు
Flight Tickets
Nikhil
|

Updated on: Feb 28, 2025 | 2:06 PM

Share

ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతిపాదిత ట్యాక్స్‌ల పెంపు వల్ల ప్రయాణికులకు దేశీయ విమాన ఛార్జీలు 1.5 నుంచి 2 శాతం పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధానిలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) నిర్వహిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (డీఐఏఎల్), ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు పీక్, ఆఫ్-పీక్ గంటల కోసం వేర్వేరు వినియోగదారు రుసుములను ప్రతిపాదించింది. ఈ విమానాశ్రయం వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం దాదాపు 109 మిలియన్లుగా ఉంది. ప్రస్తుత రూ.145 స్థాయి నుంచి అధిక ట్యాక్స్‌లను ఆమోదించిన తర్వాత ప్రతి ప్రయాణీకుడికి ఈ చార్జీలు రూ.370కి పెరుగుతుందని డీఐఏఎల్ సీఈఓ విదేవ్ కుమార్ జైపురియార్ తెలిపారు. వైపీపీలో ఎయిర్‌లైన్, ప్రయాణీకుల ఛార్జీలు కూడా ఉన్నాయి. జీఎంఆర్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం అయిన డీఐఏఎల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న 2006 స్థాయితో పోలిస్తే ప్రతిపాదిత పెరుగుదల దాదాపు 140 శాతంగా ఉంది.

ఏఈఆర్ఏ సూచించిన విధంగా రూ. 370లో దాదాపు 30 శాతం ఎయిర్‌లైన్ ఛార్జీల కోసం 70 శాతం ప్రయాణీకుల ఛార్జీల కోసం ఉండాలి. ఇప్పుడు ఇది 68 శాతం ఎయిర్‌లైన్ ఛార్జీలు, 32 శాతం ప్రయాణీకుల ఛార్జీలు అని జైపురియార్ పేర్కొన్నారు.  అధిక ట్యాక్స్‌ల కారణంగా దేశీయ ఛార్జీలపై సగటున గరిష్ట పెరుగుదల 1.5-2 శాతం ఉంటుందని, అలాగే అంతర్జాతీయ ఛార్జీలపై ఇది 1 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి సమర్పించిన టారిఫ్ ప్రతిపాదనకు సంబంధించి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2029 వరకు ఉంటుంది. ప్రస్తుతం యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్) ఒక్కో ప్రయాణీకుడికి దాదాపు రూ.77గా ఉంది.

ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ కలిగిన విమానాశ్రయంలో సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి డీఐఏఎల్ కృషి చేస్తోంది. ఈ సంస్థ ప్రతిరోజూ దాదాపు 1,300 విమానాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ నుంచి టీ2 నాలుగు నుంచి ఐదు నెలల వరకు మూసివేస్తారు. రన్‌వేలలో ఒకదాని వద్ద ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండింగ్‌లకు సామర్థ్యం పెంచేలా అప్‌గ్రేడ్ చేయనున్నారు. టీ2 షట్‌డౌన్‌తో పాటు అప్‌గ్రేడేషన్ కాలంలో సంబంధిత రన్‌వే పనిచేయదు. కాబట్టి టీ3 లోని ఒక విభాగాన్ని అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మారుస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి