Hyderabad Numaish: 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ రద్దు.. రెండేళ్లుగా నుమాయిష్‌పై కరోనా దెబ్బ!

Hyderabad Numaish: 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ రద్దు.. రెండేళ్లుగా నుమాయిష్‌పై కరోనా దెబ్బ!

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య హైదరాబాద్‌లోని ప్రముఖ ట్రేడ్ ఫెయిర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సోసైటీ ప్రకటించింది.

Balaraju Goud

|

Jan 06, 2022 | 8:17 PM

All India Industrial Exhibition Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య హైదరాబాద్‌లోని ప్రముఖ ట్రేడ్ ఫెయిర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సోసైటీ ప్రకటించింది. తెరిచిన ఒక రోజు తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెగుతుండటంతో మూసివేస్తున్నట్లు తెలిపింది. గత సంవత్సరం కూడా, మహమ్మారి కారణంగా నగరం నుమాయిష్‌ను నిర్వహించలేదు. ఇక ఈ ఏడాది నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎగ్జిబిషన్ అనుమతించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) ఈ సంవత్సరం పూర్తిగా రద్దయింది. ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నుమాయిష్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎగ్జిబిషన్‌ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. కొవిడ్ వ్యాప్తి వల్ల నుమాయిష్‌ను మూసివేయాలని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సొసైటీకి సూచించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. తాజాగా పోలీసులు సైతం నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది.

ఈ సంవత్సరం ప్రారంభమైన నుమాయిష్.. కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ భయాల మధ్య ఈవెంట్ 81వ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన ఒకరోజు తర్వాత తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసినప్పటికీ, నో-మాస్క్ నో-ఎంట్రీ విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించినప్పటికీ, భౌతిక దూరాన్ని నిర్ధారించడం వారికి సవాలుగా మారింది. దీంతో పోలీసుల సూచనల మేరకు ఈ ఏడాది శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

సొసైటీ స్టాల్ యజమానుల వ్యాక్సినేషన్ ను తప్పనిసరిగా తీసుకునేలా చూడడంతో పాటుగా రోజువారీ శానిటైజేషన్ వంటి చర్యలు తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సోసైటీ తెలిపింది. కోవిడ్-19 సేఫ్టీ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉండేలా ఎగ్జిబిషన్ వద్ద ప్రత్యేక బృందాలు పెట్రోలింగ్ చేస్తాయని కూడా పేర్కొంది. స్టాల్ యజమానులు వారి పూర్తి డోస్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సమర్పించే వరకు గుర్తింపు కార్డులను జారీ చేయమని కూడా పేర్కొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లక్షలాదిగా వచ్చే జనాలను నియంత్రించడం, వారంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్న క్రమంలో, కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ భయాల మధ్య ప్రభుత్వం నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలావుంటే, ప్రతిరోజూ దాదాపు 45,000 మంది సందర్శించే ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ‘నుమాయిష్’ జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. 2019లో 20 లక్షల మందికి పైగా ఎగ్జిబిషన్‌ని సందర్శించారు. అయితే, 2021వ సంవత్సరంలో మాత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు

1938లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్ స్టేట్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, ఫుడ్ కోర్ట్‌లతో పాటు భారతదేశం అంతటా ఉన్న వ్యాపారులు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు .

వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు అలాగే ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగిస్తాయి. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా దీనికి పేరు మార్చడం జరిగింది. దీనిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విశేషమైన ఆదరణ పొందుతూ నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు అవాంతరాలు కలుగుతూనే ఉన్నాయి.

Read Also…  Telangana: పండుగ గిఫ్ట్.. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలు పెంపు.. ఎంతంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu