మోదీ ట్రస్టుకు ఆయన తల్లి విరాళం.. పెద్ద మనసుతో..

ఈ నూతన పబ్లిక్ చారిటబుల్ ట్రస్టుకు మోదీ చైర్మన్ కాగా.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:42 pm, Tue, 31 March 20
మోదీ ట్రస్టుకు ఆయన తల్లి విరాళం.. పెద్ద మనసుతో..

కరోనా విశ్వవ్యాప్తమైన వేళ.. దీని నివారణకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ‘పీఎం కేర్స్ ఫండ్’ కి ఆయన తల్లి హీరాబెన్ తనవంతుగా రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ప్రస్తుతం గుజరాత్.. గాంధీ నగర్ సమీపంలోని రైసిన్ గ్రామంలో తన చిన్న కొడుకు పంకజ్ మోదీతో బాటు 98 ఏళ్ళ హీరాబెన్ నివసిస్తున్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందిస్తూ.. ప్రజలంతా చప్పట్లు కొట్టవలసిందిగా జనతా కర్ఫ్యూకు మోదీ  పిలుపునిఛ్చినప్పుడు ఈమె కూడా వణకుతున్న చేతులతోనే స్పందించింది. ఆరోగ్యవంతమైన భారతావనిని ఆవిర్భవింపజేసేందుకు ‘కేర్స్ ఫండ్’ ఎంతో తోడ్పడుతుందని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఈ నూతన పబ్లిక్ చారిటబుల్ ట్రస్టుకు మోదీ చైర్మన్ కాగా.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇదివరకే ‘ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్’ పేరిట ఓ ట్రస్టు ఉందని, పైగా ఆ ట్రస్టుకు రూ. 3,800 కోట్ల నిధులు ఉన్నాయని, అవి వినియోగంలోకి రాకుండా వృధాగా పడి ఉన్నాయని కాంగ్రెస్ వంటి విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ ఈ కొత్త ట్రస్టు ఎందుకని ఈ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రశ్నిస్తున్నారు. ఆ నేషనల్ రిలీఫ్ ఫండ్ పారదర్శకంగా లేక.. ఎవరికీ అంతుబట్టకుండా ఉందని ఆయన విమర్శించారు.