AirAsia: ఎయిర్‌ఏషియా ఇండియా కొనేందుకు టాటాలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఐ ఆమోదం..
AirAsia: టాటా సన్స్‌కు చెందిన ఎయిర్ ఇండియా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌ఏషియా ఇండియాలో మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది.
AirAsia: టాటా సన్స్‌కు చెందిన ఎయిర్ ఇండియా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌ఏషియా ఇండియాలో మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది. ఇప్పటికే ఎయిర్‌ఏషియా ఇండియాలో 83.67 శాతం వాటాతో టాటా సన్స్ మెజారిటీ యాజమాన్యం కలిగి ఉంది. అయితే ఏప్రిల్ నెలలో ఎయిర్‌ఏషియా ఇండియాను కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎయిర్ ఇండియా ప్రతిపాదన పంపింది.
టాటా సన్స్ సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విస్తారా క్యారియర్‌ను కూడా నడుపుతోంది. ఒప్పందంలో భాగంగా.. ఎయిర్ ఏషియా ఇండియాలో ఎయిర్ ఏషియా 16.3 శాతం వాటాను దాదాపు రూ. 139 కోట్లకు ఎయిర్ ఇండియా స్వాధీనం చేసుకోనుంది. ఈ చర్య ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన అంతర్జాతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించుకునేందుకు సహాయపడుతుందని తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అంతర్జాతీయ కార్యకలాపాలను భారీగా విస్తరించాలని టాటా గ్రూప్ చూస్తోంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఎయిర్‌లైన్‌లో 75-100 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలను చూస్తున్నట్లు తెలుస్తోంది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ స్థానిక జాయింట్ వెంచర్ విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతో సహా సాల్ట్-టు-స్టీల్ వ్యాపారాలు కలిగి ఉన్న టాటాలకు సీసీఐ ఆమోదం ఎంతగానో సహాయకారిగా నిలువనుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియాలు మెుత్తంగా 15.7 శాతం వాటా కలిగి ఉంది. ఈ డీల్ దేశంలోని విమానయాన మార్కెట్లోని పోటీని భారీగా ప్రభావితం చేయదని తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరి 27న, టాటా సన్స్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ తలాస్ ద్వారా ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్ల ఈక్విటీ, డెట్‌తో కొనుగోలు చేసింది. జూన్ 2014లో విమానయానం ప్రారంభించిన AirAsia ఇండియా, దేశంలో షెడ్యూల్డ్ ఎయిర్ ప్యాసింజర్ రవాణా, ఎయిర్ కార్గో రవాణా, చార్టర్ విమాన సేవలు వంటి వాటిని అందిస్తుంది.