PM Kisan Scheme: రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు.. అప్డేట్ వచ్చేసింది
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు రైతులకు ఎప్పుడు జమ చేస్తుందనేది క్లారిటీ వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే డబ్బులు విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో విడుదల చేయకపోతే మార్చిలో ఖచ్చితంగా అకౌంట్లో పడనున్నాయి. అయితే వారి అకౌంట్లో మాత్రం రూ.4 వేలు జమ కానున్నాయి.

పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులందరూ ఎదురుచూస్తున్నారు. గత నవంబర్‌లో 21వ విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయగా.. 22వ విడత నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని రైతులు చూస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో తర్వాతి విడత నిధులను కేంద్రం జమ చేయనుందని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. దీంతో బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ కారణంతో బడ్జెట్ తర్వాతనే రైతులకు డబ్బులు విడుదల చేసే అవకాశముంది. ఈ సారి బడ్జెట్‌లో రైతుల కోసం వ్యవసాయ రంగానికి ఎన్ని కేటాయింపులు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
వారికి రూ.4 వేలు
21వ విడతలో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ నిధులు జమ కాలేదు. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం, బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేయకపోవడం, బ్యాంకు వివరాల్లో తప్పల వల్ల కొంతమంది రైతులకు డబ్బులు పడలేదు. దీంతో వారికి ఈ సారి వచ్చే నిధులతో కలిపి పాత బకాయిలను చెల్లించనున్నారు. అలాంటి రైతులకు ఈ విడత రూ.2 వేలు, గతంలో ఆగిపోయిన రూ.2 వేల కలిపి ఒకేసారి జమ కానున్నాయి. దీంతో వీరి అకౌంట్లో ఒకేసారి రూ.4 వేలు జమ కానున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ చాలారోజులు వాడకపోయినా కేవైసీ డీయాక్టివ్ అవుతుంది. మీరు బ్యాంక్‌కు వెళ్లి ఆధార్ ఓటీపీ ద్వారా కేవేసీ ప్రక్రియ పూర్తి చేస్తే తర్వాతి విడతలో ఒకేసారి పెండింగ్ డబ్బులను కేంద్రం జమ చేస్తోంది.
కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ లబ్దిదారులు కేవైసీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక బ్యాంకు కేవైసీ అప్డేట్ చేసుకోపోయినా నిధులు ఆగిపోతాయి. దీంతో ఏడాదికి ఒకసారి బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ తప్పనిసరిగా లింక్ చేసుకుని ఉండాలి. అప్పుడే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. కేవేసీ పూర్తి చేయనివారికి పీఎం కిసాన్ నిధులను నిలిపివేస్తారు. మళ్లీ కేవైసీ పూర్తి చేసినప్పుడు ఈ నిధులు మీ అకౌంట్లో జమ అవుతాయి.
