Gold Prices: తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం.. నేటి నుంచే అమల్లోకి..
బంగారం, వెండి విషయంలో కేంద్రం పెద్ద మార్పులు చేసింది. కనీస దిగుమతి ధరలను తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి.

బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోల్డ్, సిల్వర్ కనీస దిగుమతి ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 10 గ్రాముల బంగారపై కనీస దిగుమతి ధరను 80 డాలర్లకు తగ్గించగా.. ఇది 1343 డాలర్లకు చేరుకుంది. ఇక కిలో వెండి ప్రాధమిక దిగుమతి ధరను 276 డాలర్లు తగ్గించడంతో 2092కి చేరుకుంది. వీటి తగ్గింపుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. జూన్ 12వ తేదీ నుంచే ఈ సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గతంలో 10 గ్రాముల బంగారంకు 1423గా ఉండేది. గత సుంకంతో పోలిస్తే 5.62 శాతం తగ్గిందని చెప్పవచ్చు.
వెండిపై కూడా తగ్గింపు
ఇక వెండి విషయానికొస్తే గతంలో కిలోకు సుంకం విలువ 2363 డాలర్లుగా ఉండేది. ఇప్పుడు 11.66 శాతం తగ్గించింది. అయితే ముడి పామాయిల్, ఆర్‌బిడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనె వంటి ఇతర వస్తువుల సుంకాల విలువల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కేంద్రం అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా సుంకాల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే బంగారం, వెండి కనీసం దిగుమతి ధరల్లో మార్పులు చేసినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదైన క్రమంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరల్లో మార్పుల తర్వాత దిగుమతి ధరలను తగ్గించింది.
కనీస దిగుమతి ధర అంటే..?
కనీస దిగుమతి ధర అంటే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని లెక్కించడానికి ప్రామాణికంగా ఉపయోగిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సాధారణంగా ప్రతి పక్షం రోజులకు ఈ విలువలను సమీక్షించి సవరణలు చేస్తూ ఉంటుంది. అయితే ప్రపంచ ధరలలో అధిక అస్థిరత ఉన్న కాలాల్లో మార్పులు తరచుగా మార్పులు చేస్తూ ఉంటుంది. అయితే దిగుమతి ధర తగ్గింపు వల్ల నేరుగా దుకాణాలో బంగారు ఆభరణాలు కొనుగోలుచేసేవారికి ప్రయోజనం ఉండదు. బంగారం దిగుమతి చేసుకునే డీలర్లకు దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది. భారత్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న తరుణంలో రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే వరుసగా టారిఫ్ విలువలను తగ్గిస్తూ పోతే రిటైల్ వినియోగదారుకు ఊరట కలిగే అవకాశముంటుంది. కాగా డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు వారాలుగా తగ్గగా.. శుక్రవారం కాస్త పెరిగాయి. ఒడిదొడుకుల క్రమంలో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది.
