AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitcoin – The Ruler: ట్రంప్ రాకతో దూసుకుపోతున్న క్రిప్టోకరెన్సీ.. లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్ విలువ

గురువారం, డిసెంబర్ 5, Bitcoin మొదటిసారి $100,000 పైన చేరుకుంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం వల్ల బిట్ కాయిన్ బలం పుంజుకుంది.

Bitcoin - The Ruler: ట్రంప్ రాకతో దూసుకుపోతున్న క్రిప్టోకరెన్సీ.. లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్ విలువ
Bitcoin
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 05, 2024 | 11:56 AM

Share

దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినీ ప్రపంచాన్ని దున్నేస్తూ దూసుకుపోతోంది. పుష్ప-2 ను ‘ది రూలర్’ క్యాప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే..! సినీ ప్రపంచంలో ఇది రూల్ చేస్తుంటే.. సరిగ్గా ఇదే సమయంలో ‘క్రిప్టో’ ప్రపంచంలో బిట్‌కాయిన్ రూల్ చేస్తోంది..! క్రిప్టో కరెన్సీలో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్ విలువ తాజాగా లక్ష డాలర్ల స్థాయిని దాటి రికార్డు సృష్టించింది. క్రిప్టో ప్రపంచంలో ‘ది రూలర్’గా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది.

క్రిప్టో కరెన్సీకి పూర్తి మద్దతు ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందే ఇంత భారీగా పెరుగుదల నమోదు చేసుకున్న బిట్ కాయిన్, జనవరిలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయానికి 1.25 లక్షల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జూలై చివర్లో, డొనాల్డ్ ట్రంప్ నాష్‌విల్లే బిట్‌కాయిన్ కాన్ఫరెన్స్‌కు చేరుకున్నప్పుడు ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో రాజధానిగా మారుస్తానని చెప్పారు. ఆ ఒక్క రోజే బిట్‌కాయిన్ ధరలో 4 శాతం కంటే ఎక్కువ పెరుగి ధర 67 వేల డాలర్లకు చేరుకుంది.

నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు, బిట్‌కాయిన్ ధర 67 నుండి 68 వేల డాలర్ల మధ్య ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర ఇంత త్వరగా లక్ష డాలర్లు దాటుతుందని నాష్‌విల్లే సదస్సులోగానీ, అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత గానీ ఊహించలేదు. నవంబర్ 5 నుండి బిట్‌కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరిగింది. ఏడాది క్రితం నాటి ధరతో పోల్చితే.. బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసినవారు 145 శాతానికి పైగా సంపాదించారు.

ఆల్ టైమ్ రికార్డు ధర

Coinmarket డేటా ప్రకారం Bitcoin ధర 7 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో $102,656.65 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో బిట్‌కాయిన్ ధరలు గరిష్టంగా $103,900.47కి చేరుకుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఏ రకంగా చూసినా దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ ధర త్వరలో 1.25 లక్షల డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. వచ్చే ఏడటాది జనవరి 20 తర్వాత బిట్‌కాయిన్ ఈ ధరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటికి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే క్రిప్టోకరెన్సీ, దాని మార్కెట్‌కు సంబంధించి కొన్ని సానుకూల ప్రకటనలు, నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (SEC)కు అధిపతిగా పాల్ ఆట్కిన్స్‌ను నియమించనున్నట్టు ట్రంప్ ఇప్పటికే సంకేతం ఇచ్చారు. ఆయన గతంలో SEC కమిషనర్‌గా క్రిప్టో పాలసీ రూపకల్పనకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న గ్యారీ గెన్స్‌లర్ కఠినమైన నిబంధనలు, స్క్రూటినీ అమలు చేస్తున్నారు. ట్రంప్ నాయకత్వం సరళీకృత విధానాలతో ముందుకెళ్లనుంది. అందుకే క్రిప్టో మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది.

మారిన ట్రంప్ వైఖరి

డోనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా లేరు. ఆయన మొదటి పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో క్రిప్టో కరెన్సీని ఒక ‘స్కామ్’గా అభివర్ణించారు. అయితే ట్రంప్ హయాంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులను ప్రోత్సహించింది. తర్వాత క్రిప్టో ప్రపంచం సామర్థ్యాన్ని గ్రహించిన ట్రంప్.. తాజా ఎన్నికల ప్రచారంలో తనను తాను “క్రిప్టో-ఫ్రెండ్లీ”గా ప్రకటించుకోవడంతో పాటు అమెరికాను క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మార్చుతానని ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..