Amazon layoffs: ‘ఉద్యోగాల తొలగింపు వచ్చే ఏడాదిలో కూడా ఉంటుంది.. ఎంతమంది అనేది ఇంకా నిర్ణయించలేదు’
ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది పది వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని, వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు కొనసాగుతాయని ఆ..
ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది పది వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని, వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు కొనసాగుతాయని ఆ సంస్థ సీఈఓ ఆండీ జస్సీ గురువారం (నవంబర్ 17) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం తన కంపెనీ ఉద్యోగులకు పంపిన నోట్‌లో తెలిపారు. ఈ పోస్టులో నేను ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైందని ఈ నోట్‌లో తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని అమెజాన్ నిర్ణయించుకుంది. ఎక్కువగా ఆదా చేయడానికి ఆస్కారమున్న విభాగాలను గుర్తించడానికి సమీక్షలు సైతం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు, గత కొన్నేళ్లుగా కంపెనీ చేపట్టిన వేగవంతమైన నియామకాల కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జాస్సీ తెలిపారు.
ఈ క్రమంలో అమెజాన్ కాలిఫోర్నియాలోని వివిధ విభాగాల్లో సుమారు 260 మంది కార్పొరేట్ కార్మికులను తొలగిస్తున్నట్లు తెలియజేసింది.ఈ వారంలో కార్పోరేట్ వర్క్‌ఫోర్స్‌లో మొత్తం ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తారో కంపెనీ ఇంకా నిర్ణయించలేదని జెస్సీ అన్నారు. సమీక్ష ఫలితాలను బట్టి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని, ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని, కంపెనీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని జెస్సీ తెలిపారు. కాగా ఫేస్‌బుక్ పేరెంట్ మెటా గత వారం 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ట్విటర్ కూడా తమ కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను సగానికి తగ్గిస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.