NPS Rules Change: ఎన్‌పీఎస్ ఖాతాదారులకు అలర్ట్.. అమలులోకి వచ్చిన కొత్త రూల్..
ప్రస్తుతం ఏప్రిల్ 1, 2023 నుంచి పీఎఫ్ఆర్‌డీఏ సబ్‌స్క్రైబర్‌లకు ఎంపిక చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేసింది. ఎన్‌ఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత యాన్యుటీ చెల్లింపులను వేగంగా, సరళంగా చేయడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు.

కష్టపడి సంపాదించిన సొమ్ము రూపాయి రూపాయి దాచుకుని లేవలేని పరిస్థితులు అంటే వృద్ధాప్యంలో అండగా ఉంటుందని ప్రతి ఉద్యోగి పొదుపు మొదలుపెడతారు. అలాంటి ఉద్యోగులకు బాసటగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా జాతీయ పెన్షన్ వ్యవస్థ ((ఎన్‌పీఎస్) )ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పౌరులకు సరసమైన ధరల్లోనే సామాజిక భద్రత అందుతుంది. ముఖ్యంగా కొత్త పింఛన్ విధానం అమలవుతున్న ఉద్యోగుల పింఛన్ లావాదేవీలు ఈ ఎన్‌పీఎస్ ఖాతా ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఇది ఓ మార్కెట్ లింక్డ్ పింఛన్ పథకం. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు, యజమానుల ద్వారా ఈ ఎన్‌పీఎస్ ఖాతాలో సొమ్ము పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్ 1, 2023 నుంచి పీఎఫ్ఆర్‌డీఏ సబ్‌స్క్రైబర్‌లకు ఎంపిక చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేసింది. ఎన్‌ఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత యాన్యుటీ చెల్లింపులను వేగంగా చేయడం కోసం ఈ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఫిబ్రవరి 22 2023న రిలీజ్ చేసిన సర్క్యులర్‌లో తెలిపిన వివరాల ప్రకారం సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా యాన్యుటీ ఆదాయాన్ని సకాలంలో చెల్లించడానికి పత్రాల అప్‌లోడ్ తప్పనిసరి చేసింది. కాబట్టి వినియోగదారులు ఈ మార్పును పరిగణలోకి తీసుకోవాలని పీఎఫ్ఆర్‌డీఏ సూచించింది.
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు ఇవే
సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) యూజర్ ఇంటర్‌ఫేస్‌కు అప్‌లోడ్ అయ్యిందని నిర్ధారించుకోవాలని పీఎఫ్ఆర్‌డీఏ చందాదారులను, సంబంధిత నోడల్ అధికారులను కోరింది. అలాగే అప్ లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా పేర్కొంది. అవి
- ఎన్‌పీఎస్ నిష్క్రమణ లేదా ఉపసంహరణ ఫారమ్.
- ఉపసంహరణ ఫారమ్‌లో పేర్కొన్న విధంగా గుర్తింపు, చిరునామా రుజువు.
- బ్యాంక్ ఖాతా రుజువు
- శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య కాపీ అంటే ప్రాన్ కాపీ
ఈ కొత్త నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని నోడల్ కార్యాలయాలు/ పీఓపీలు/కార్పొరేట్‌లు సంబంధిత సబ్‌స్క్రైబర్‌లకు డాక్యుమెంట్‌ల అప్‌లోడ్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని పీఎఫ్‌ఆర్డీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది.
సబ్‌స్క్రైబర్ నిష్క్రమణ అభ్యర్థన ఇలా
- సీఆర్ఏ సిస్టమ్‌లోకి లాగిన్ చేయడం ద్వారా చందాదారు ఆన్‌లైన్ నిష్క్రమణ అభ్యర్థనను ప్రారంభిస్తారు.
- అభ్యర్థన ప్రారంభించే సమయంలో ఈ-సైన్ లేదా ఓటీపీ ప్రమాణీకరణ, నోడల్ ఆఫీస్, పీఓపీ ద్వారా అభ్యర్థన సంబంధిత సందేశాలు యూజర్ విండోలో మనకు కనిపిస్తాయి.
- అభ్యర్థన ప్రారంభ సమయంలో చిరునామా, బ్యాంక్ వివరాలు, నామినీ వివరాలు మొదలైన వివరాలు ఎన్‌పీఎస్ ఖాతా నుంచి ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతాయి.
- సబ్‌స్క్రైబర్ ఏకమొత్తం/యాన్యుటీ వివరాల కోసం ఫండ్ కేటాయింపు శాతాన్ని ఎంచుకుంటారు.
- ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ ద్వారా చందాదారుల బ్యాంక్ ఖాతా ధ్రువీకరించవచ్చు.
- సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా నిష్క్రమణ అభ్యర్థనను సమర్పించే సమయంలో కేవైసీ పత్రాలు ప్రాన్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
- స్కాన్ చేసిన పత్రాలు సముచితంగా ఉండాలి అంటే స్కాన్ చేసిన చిత్రాలు స్పష్టంగా ఉండాలని గుర్తుంచుకోవాలి.
- ప్రక్రియను కాగితరహితంగా చేయడానికి సబ్‌స్క్రైబర్ రెండు ఎంపికల్లో ఏదైనా ఒకదాన్ని ఉపయోగించడం ద్వారా అభ్యర్థనను ప్రామాణీకరించవచ్చు.
- ఓటీపీ ప్రమాణీకరణ – విభిన్న ఓటీపీలు చందాదారుల మొబైల్ నంబర్‌లు, ఇమెయిల్ ఐడీలకు పంపుతారు.
- ఈ-సైన్ – సబ్‌స్క్రైబర్‌లు ఆధార్‌ని ఉపయోగించి అభ్యర్థనపై ఈ-సైన్ చేయడంతో నిష్క్రమణ అభ్యర్థన విజయవంతంగా ప్రాసెస్ చేయవచ్చు.