AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: గుడ్ న్యూస్.. తగ్గనున్న కేబుల్ టీవీ ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం..?

దేశంలో ప్రజల దైనందిన జీవితంలో టీవీ ఒక ముఖ్యమైన భాగం. కానీ ఈ రంగంపై ప్రస్తుతం 18శాతం జీఎస్టీ ఉంది. దీని కారణంగా టీవీ బిల్లు ఖరీదైనదిగా మారింది. ఈ నేపథ్యంలో కేబుల్ టీవీ పరిశ్రమ ఈ సేవపై జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

GST: గుడ్ న్యూస్.. తగ్గనున్న కేబుల్ టీవీ ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం..?
Gst On Cable Tv
Krishna S
|

Updated on: Aug 28, 2025 | 7:01 AM

Share

ప్రధాని మోదీ జీఎస్టీలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ఎప్పుడైతో చెప్పారో అప్పటి నుంచి ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనేదానిపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలో కేబుల్ టీవీ కస్టమర్లు త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబుల్ టీవీ సేవలపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని కేబుల్ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌కు ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా నెలవారీ టీవీ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ పేరుతో కేబుల్ ఆపరేటర్ల అతిపెద్ద సంస్థ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళింది. కేబుల్ టీవీ పరిశ్రమలో పది లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, అయితే ప్రస్తుతం ఈ రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఫెడరేషన్ తెలిపింది.

ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి కేబుల్ ఫెడరేషన్ ఓ లేఖ రాసింది. అధిక జీఎస్టీ, శాటిలైట్ ఛానెల్‌ల ధరల పెరుగుదల, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వస్తున్న తీవ్ర పోటీ వంటి కారణాల వల్ల కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు. ఈ కష్టాలను అధిగమించాలంటే, జీఎస్టీ రేటును తగ్గించడం అత్యవసరమని నొక్కి చెప్పారు. జీఎస్టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గితే, వినియోగదారుల నెలవారీ బిల్లులపై పన్ను భారం తగ్గుతుంది. దీని వల్ల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.

ఈ పన్ను తగ్గింపు వల్ల కేబుల్ ఆపరేటర్లకు ఆర్థిక బలం చేకూరుతుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాలైన మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు, స్థానిక ఆపరేటర్లు తమ వ్యాపారాలను మెరుగ్గా నిర్వహించగలుగుతారు. అంతేకాకుండా బ్రాడ్‌బ్యాండ్,డిజిటల్ సేవల విస్తరణలో పెట్టుబడి పెట్టేందుకు వారికి అవకాశం లభిస్తుంది. ఇది ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ మిషన్‌కు కూడా తోడ్పడుతుంది. ప్రస్తుతం సబ్సిడీలు లేదా పన్ను మినహాయింపులతో తక్కువ ధరలకు సేవలు అందిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో కేబుల్ టీవీ పరిశ్రమ పోటీ పడటానికి ఈ నిర్ణయం సహాయపడుతుంది.

సామాజిక – ఆర్థిక ప్రభావం

కేబుల్ టీవీ కేవలం వినోదం మాత్రమే కాదని, పట్టణాలు, గ్రామాల్లోని కుటుంబాలకు వార్తలు, విద్య సమాచారం అందించే ముఖ్యమైన మాధ్యమమని కేబుల్ ఫెడరేషన్ తెలిపింది. జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి కూడా సురక్షితంగా ఉంటుందని చెప్పింది. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పరిశీలిస్తే, భవిష్యత్తులో కేబుల్ టీవీ సేవలు మరింత అందుబాటులోకి వచ్చి, సామాన్య ప్రజలకు మరింత ప్రయోజనం లభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వ స్పందన కోసం కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..