Maruti suzuki: మన దేశంలోకి పెట్టుబడుల వరద.. భారీగా ఇన్వెస్ట్ చేయనున్న టాప్ కంపెనీ
ప్రపంచంలో వర్తక, వ్యాపారాలకు సంబంధించి కీలక మార్కెట్ గా మన దేశం ఎదుగుతోంది. వ్యాపార విస్తరణ కోసం అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా, సహజ వనరులు, రాజకీయ స్థిరత్వం, కష్టబడి పనిచేసే ప్రజలున్న మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాల్లోని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి 2030 నాటికి తన వ్యాపారాన్ని మూడో వంతు పెంచాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగా మన దేశంలో భారీగా పెట్టుబడి పెట్టాలనుకుంటోంది.

మారుతీ సుజుకి కంపెనీ నుంచి విడుదలయ్యే వాహనాలకు మన దేశంలో మంచి మార్కెట్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదరణ లభిస్తోంది. ఆ సంస్థ రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 4.2 మిలియన్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న విక్రయాల ప్రకారం లెక్కిస్తే.. అది మూడింట ఒక వంతు పెరుగుదల అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తన ప్రధాన మార్కెట్ అయిన భారత దేశంలో అమ్మకాలు పెంచుకోవాలని నిర్ణయించుకుంది. సుజుకి సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా 2 ట్రిలియన్ యెన్లు (13 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. దీనిలో దాదాపు 60 శాతం మన దేశంలోనే ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే మొత్తం విక్రయాలు సుమారు 60 శాతం మన దేశంలోనే జరుగుతాయని అంచనా వేస్తోంది. భారతదేశంలోని మార్కెట్ పైనే ఆధారపడి, తన విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటోంది.
ఇండియాలోని కార్ల మార్కెట్ లో తన వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు ఇక్కడి తయారు చేసిన కార్లను ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల మార్కెట్లకు ఎగుమతి చేయడం సుజుకి కంపెనీ ప్రధాన లక్ష్యం. ఆ కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయానే ప్రముఖంగా వెల్లడించారు. తమకు ఇండియా ప్రధాన మార్కెట్ అని, అక్కడ వ్యాపారాన్ని విస్తరించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
సుజుకి సంస్థ 1980 నుంచే మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు సంబంధించిన మారుతీ సుజుకి కి దేశ కార్ల మార్కెట్ లో దాదాపు 40 శాతం వాటా ఉంది. దీని మరో 20 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రస్తుతం ముందుకు వెళుతోంది. దానిలో భాగంగా 2030 నాటికి మన దేశంలో నాలుగు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 2030 నాటికి కనీసం పది శాతం నిర్వహణ లాభాలను మార్జిన్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 9.20 శాతం మాత్రమే నమోదైంది. ఈక్విటీపై వస్తున్న 12.6 శాతం రాబడిని 15 శాతానికి పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. మొత్తాన్ని 2030 నాటికి 49 శాతం వృద్ధితో 8 ట్రిలియన్ యెన్ల ఆదాయం ఆర్జించాలని టార్గెట్ నిర్దేశించుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








