Punjab National Bank: బ్యాంకుల్లో భారీగా తగ్గిన వడ్డీరేట్లు..రుణ ఖాతాదారులకు పండగే..!
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా, వడ్డీరేటు ఎంత ఉంటుందోనని ఆలోచిస్తున్నారా, అయితే మీకు ఇదే మంచి సమయం. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి. హౌసింగ్, వ్యక్తిగత తదితర రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా తమ ఖాతాదారులకు తక్కువ వడ్డీకి రుణాలను అందజేస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్)కు తగ్గించింది. దాని ప్రకారం దేశంలోని రెండో అతి పెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. ఇవి ఫిబ్రవరి పదో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. హౌసింగ్, వ్యక్తిగత, కారు, విద్య తదితర రుణాలన్నింటికీ ఈ సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుతో హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తోంది. ఏడాదికి 8.15 శాతంతో ఇవి ప్రారంభవుతున్నాయి. 2025 మార్చి 31 వరకూ తీసుకునే కొన్ని రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంట్ చార్జీలు ఉండవు. కొన్ని వాటికి 30 ఏళ్ల వరకూ సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే కాలపరిమితిని అందిస్తోంది. అలాగే ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం, మారటోరియం కాలం, అర్హత మెరుగుదల తదితర అదరపు సౌకర్యాలు కల్పిస్తోంది.
- డిజిటల్ హౌసింగ్ రుణాలను కూడా పీఎన్బీ మంజూరు చేస్తోంది. దీని ద్వారా ఖాతాదారులు ఏ ప్రదేశం నుంచైనా డిజిటల్ గా రూ.5 కోట్ల వరకూ హౌసింగ్ రుణాలను పొందవచ్చు. వీటి వడ్డీ రేటు ఏడాదికి 8.15 శాతం నుంచి మొదలవుతుంది. ఒక లక్ష రూపాయలకు రూ.744 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఈ రుణాలకు ముందస్తు చెల్లింపులు, ప్రాసెసింగ్ రుసుములు, డాక్యుమెంటేషన్ చార్జీలు ఉండవు.
- ఐటీ నిపుణులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పీఎన్బీ జెన్ నెక్ట్స్ రుణాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల వయసు వరకూ జీతం పొందే వ్యక్తులకు వీటిని మంజూరు చేస్తారు. వీటికి 8.15 శాతం వడ్డీని వసూలు చేస్తారు. దాదాపు 30 ఏళ్ల వరకూ ఈఎంఐలు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
- అధిక ఆదాయం కలిగిన వర్గాల కోసం పీఎన్బీ మాక్స్ సేవర్ అనే హౌసింగ్ రుణ పథకం అమలవుతోంది. దీని వడ్డీ రేటు 8.30 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 2025 మార్చి 31వ తేదీ వరకూ వీటిపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఉండవు.
- పీఎన్బీ డిజిటల్ కార్ లోన్ ద్వారా గరిష్టంగా రూ.20 లక్షలు పొందవచ్చు. దీనికి 8.50 శాతం వడ్డీ ఉంటుంది. నెలకు రూ.1240 ఈఎంఐగా చెల్లించాలి. అలాగే వ్యక్తిగత రుణాలపై 11.25 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




