NASSCOM: వారంలో మూడు రోజులు ఆఫీస్‌కి.. హైబ్రిడ్ పని విధానానికే మొగ్గు చూపుతున్న ఐటీ ఉద్యోగులు, యాజమాన్యాలు..
వారంలో కొన్ని రోజులు ఆఫీస్‌లో మరికొన్ని రోజులు ఇంటిదగ్గర పని చేసే హైబ్రిడ్ విధానానికి ఐటీ ఉద్యోగులు, యాజమాన్యాలు ఆసక్తి చూపుతున్నాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఇన్‌డెడ్‌తో కలిసి నిర్వహించిన 'నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే' తేలింది...
వారంలో కొన్ని రోజులు ఆఫీస్‌లో మరికొన్ని రోజులు ఇంటిదగ్గర పని చేసే హైబ్రిడ్ విధానానికి ఐటీ ఉద్యోగులు, యాజమాన్యాలు ఆసక్తి చూపుతున్నాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఇన్‌డెడ్‌తో కలిసి నిర్వహించిన ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ తేలింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజుల వరకు కార్యాలయాలకు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. మధ్య వయస్సు ఉద్యోగులతో పోలిస్తే జూనియర్ (25 ఏళ్ల లోపు), సీనియర్ (40 ఏళ్లకు పైబడిన) ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహిళా ఉద్యోగులు కూడా కార్యాలయాలకు వచ్చేందుకు ఉత్సుకత కనబరుస్తున్నారని, కొత్త పని విధానానికి అలవాటు పడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
81 శాతానికి పైగా సంస్థలు కార్యాలయాలను పునఃప్రారంభించే సమయంలో ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు కీలకమని చెప్పినట్లు సర్వే పేర్కొంది. అయితే 72 శాతం సంస్థలు వచ్చే ఏడాది నుంచి గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగుల సామర్థ్యంతో పనిచేయాలని చూస్తున్నాయి. మహమ్మారి అనంతర కాలంలో కంపెనీలు కొత్త వర్క్ ఆపరేటింగ్ మోడల్‌లను అమలు చేయడానికి ఎదురు చూస్తున్నాయి. 70 శాతం కంటే ఎక్కువ సంస్థలు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ఇష్టపడుతున్నాయి.
“గత ఒకటిన్నర సంవత్సరాలుగా టెక్ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న విధానం భారీ మార్పుకు గురైంది. క్రమంగా తిరిగి ఆఫీస్‌లు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్‌సైట్, రిమోట్ ఆపరేటింగ్ మోడల్‌లలో ఉత్తమమైన వాటిని తీసుకువచ్చే హైబ్రిడ్ ఆపరేటింగ్ మోడల్‌ను పరిపూర్ణం చేయడానికి చూస్తోంది” అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ చెప్పాడు.
Read Also.. WhatsApp Feature Update: వాట్సాప్ కొత్త ఫీచర్ అప్డేట్.. ఆ సమయాన్ని పెంచుతారటా..