‘పార్టీని వీడవలసిన సమయం ఆసన్నమైంది’.. సింధియా ‘

కాంగ్రెస్ పార్టీతో  దాదాపు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పార్టీని వీడారు. ప్రధాని మోదీతోనూ, హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయిన అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

'పార్టీని వీడవలసిన సమయం ఆసన్నమైంది'.. సింధియా  '
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2020 | 2:10 PM

కాంగ్రెస్ పార్టీతో  దాదాపు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పార్టీని వీడారు. ప్రధాని మోదీతోనూ, హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయిన అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సింధియా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. ముఖ్యంగా  తన గ్రాండ్ మదర్ విజయరాజే సింధియా స్ఫూర్తితో ఆయన బీజేపీలో చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడనుంది. సోనియాకు సింధియా  రాజీనామా లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

‘సోనియాజీ ! గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా ఉన్న నేను ఇక పార్టీని వీడవలసిన సమయం ఆసన్నమైంది. నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. గత ఏడాది కాలంగా ఇది నేను ఎంచుకున్న మార్గమని మీకు తెలుసు. తొలినుంచీ నా రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలన్నది నా లక్ష్యం. అయితే ఈ పార్టీతో ఈ లక్ష్యాన్ని సాధించలేనని నమ్ముతున్నాను. నా ప్రజలు, నా కార్యకర్తల ఆశయాల మేరకు ఇక ఓ కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఈ దేశానికి సేవ చేసేందుకు నాకు, నా సహచరులకు అవకాశం ఇఛ్చినందుకు మీకు ధన్యవాదాలు’..

2001 లో రాజకీయ ప్రవేశం చేసిన సింధియా.. విమాన ప్రమాదంలో తన తండ్రి మాధవరావు సింధియా మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ లో గుణ  పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న ఆయన కోర్కె నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అత్యంత విధేయుడిగా ఉన్న కమల్ నాథ్ నే మధ్యప్రదేశ్ సీఎం పదవికి పార్టీ ఎంపిక చేసింది. దీంతో.. దాదాపు అలక బూనిన సింధియా పార్టీ కార్యకలాపాలకు దూరంగా . ఉంటూ వచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా అనుకూల వైఖరిని పాటించారు.

తనకు రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవిని ఇఛ్చిన పక్షంలో.. ఇందుకు బదులుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సాయపడతానని ఆయన బీజేపీ నేతలకు హామీ ఇఛ్చినట్టు తెలిసింది. ఇందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 114 మంది, బీజేపీకి చెందిన 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ముగ్గురు, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు. సింధియా మద్దతుదారులైన 19 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపారు.