AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జార చేసింది. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారన్న ఏపీ ప్రభుత్వ అభియోగంపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం టీడీపీ నేతలను ఆదేశించింది.

టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు
Rajesh Sharma
|

Updated on: Nov 05, 2020 | 4:56 PM

Share

Supremecourt notices to TDP leaders: అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేసింది. వారితో పాటు భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కూడా నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తును నిలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

గురువారం ఉదయం విచారణ ప్రారంభం కాగానే సుప్రీం ధర్మాసనం పలు సునిశిత ప్రశ్నలు అడిగింది. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న దుష్యంత్ దవే గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ భూ కుంభకోణంపై స్టే ఇచ్చే అధికారం రాష్ట్ర హైకోర్టుకు లేదని నివేదించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా ప్రతివాదులుగా చేర్చారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం, ఈడీ ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్లను తోసిపుచ్చినట్టు వెల్లడించారు.

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను ఈ ప్రభుత్వం సమీక్షిస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. అన్నీ కాదు, భారీస్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్న అంశాల్లో మాత్రమే విచారణ జరుపుతున్నామంటూ దుష్యంత్ దవే తెలిపారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని, సుప్రీం ఆదేశాలకు లోబడాల్సిందేనని వెల్లడించిన దవే.. తన వాదనను బలపర్చే పాత తీర్పులను ఉదహరించారు.

రాష్ట్ర కేబినెట్ జూన్ నెలలో సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుందని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా సాగుతున్న తరుణంలో దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ దవే ధర్మాసనానికి నివేదించారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం కుదరదని, కొందరు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో సిట్ దర్యాప్తుపై పిటిషన్లు వేశారని ఆయన వివరించారు. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరన్న విషయాన్ని దుష్యంత్ దవే ఉటంకించారు.

పారదర్శకంగా సాగుతున్న సిట్ దర్యాప్తును టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని దుష్యంత్ దవే అభియోగం మోపారు. దాంతో విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందానికి, తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేసింది.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం

ALSO READ: చంద్రబాబు ఆరోపణ తప్పని తేల్చిన కేబినెట్