రాష్ట్రంలో కరోనా కేసులు !..3 వేల బెడ్లు సిద్ధం..
చాపకింద నీరులా తెలంగాణలో ప్రవేశించిన కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం..ఆయా శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వశాఖల మధ్య సమన్వయానికి కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే...
చాపకింద నీరులా తెలంగాణలో ప్రవేశించిన కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతోంది. వైరస్‌ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలేవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ ..వైరస్ ప్రభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేశారని వివరించారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వశాఖల మధ్య సమన్వయానికి కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో నమోదైన తొలి కేసుతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్ సోకిన బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటువైపు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా, అతడి పరిస్థితి నిలకడగానే ఉందని గాంధీ వైద్యులు వెల్లడించారు. యువకుడు తిరిగిన ప్రదేశాల్లో 88 మందిని గుర్తించారు వారందరికీ కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రితో పాటు టు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి.. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను అప్రమత్తంచేసింది ప్రభుత్వం. వైద్యసిబ్బంది సెలవులను రద్దుచేసింది. ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర వైద్య బృందంతోపాటు ప్రత్యేకశిక్షణ పొందిన నగర వైద్యబృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మంగళవారం మరో 34 మంది అనుమానితులకు ముందుజాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
కొవిడ్-19 ఐసోలేషన్ సేవల ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల బెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఫీవర్, చెస్ట్ దవాఖానలతోపాటు మిలిటరీ, వికారాబాద్ దవాఖానల్లో ఐసోలేషన్ వార్డుల్లో 800 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. పలు బోధనాసుపత్రుల్లో 2,200 బెడ్లు సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే ఫీవర్ ఆస్పత్రిలో 40, గాంధీలో 40, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో 20, ఉస్మానియాలో 10 పడకల సామర్ధ్యంగల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టు వైద్యశాఖాధికారులు తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ విభాగంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, 5 నుంచి 8 గంటల్లోనే రిపోర్టులను వెల్లడిస్తున్నామని వివరించారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల సూచిస్తున్నారు.