కమలాకర్షణలో జనసేనాని… మాటల మర్మమదేనా?

పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి… ఈ దేశానికి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అంటూ తిరుపతిలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో అమిత్ షా లాంటివాళ్లే కరెక్ట్ అని… ఆయనైతేనే ఉక్కుపాదంతో ప్రత్యర్థులను తొక్కేస్తారని అన్నారు. మెత్తగా ఉంటే రాజకీయాల్లో కొనసాగలేమన్నారు. ఈ మధ్యకాలం వరకు బీజేపీని, […]

కమలాకర్షణలో జనసేనాని... మాటల మర్మమదేనా?
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:21 PM

పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి… ఈ దేశానికి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అంటూ తిరుపతిలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

రాజకీయాల్లో అమిత్ షా లాంటివాళ్లే కరెక్ట్ అని… ఆయనైతేనే ఉక్కుపాదంతో ప్రత్యర్థులను తొక్కేస్తారని అన్నారు. మెత్తగా ఉంటే రాజకీయాల్లో కొనసాగలేమన్నారు. ఈ మధ్యకాలం వరకు బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా పూర్తిగా రూట్ మార్చేశారు. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పపటి నుంచి ఆయన మాట తీరు మారింది. ఢిల్లీ వెళ్లినపుడు కూడా ఆయన ఎవర్ని కలిశారనే అంశాలను రహస్యంగా ఉంచారు.

ఢిల్లీ వెళ్లి వచ్చాక మాటల్లో పదును పెంచారు పవన్… సీఎం జగన్ టార్గెట్‌గా దూకుడు పెంచారు. అసలు సీఎం జగన్‌ను తాను సీఎంగానే గుర్తించనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాయలసీమ వైపు దృష్టిపెట్టారు. అందుకే గత నాలుగురోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. జగన్ మతం, కులం మీద ఎక్కువగా టార్గెట్ చేశారు… జగన్ మాట్లాడిన ప్రతి అంశానికి ధీటుగా విమర్శనాత్మకంగా సమాధానం ఇస్తున్నారు.

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ టీడీపీనా, జనసేననా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు కూడా ఇదే రాయలసీమలో పర్యటిస్తున్నప్పటికీ ఆయనకు పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు వైసీపీ. జనసేన పార్టీని, పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ …చంద్రబాబుకు హచ్ డాగ్ లా మారారంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెట్స్ కూడా జనసేనలో ఆగ్రహానికి కారణమయ్యాయి.

అలాగే పవన్ కల్యాణ్ కేవలం పవర్ బ్యాంక్ లాంటి వాళ్లేనంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులు కూడా జనసేనలో మరింత వేడి పుట్టించాయి. అందుకే జగన్ టార్గెట్‌గా మరింత వాయిస్ పెంచారు పవన్. ఇదంతా కేవలం ఢిల్లీ పర్యటన రిజల్టే నంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఇవాళ జగన్‌ను విమర్శిస్తూ అమిత్ షాను పొగడటం వెనుక కూడా భారీ స్కెచ్ ఉందనేది ఇప్పుడుప్రధానంగా చర్చనీయాంశమైంది.

ఢిల్లీలో పవన్ …రహస్యంగా అమిత్ షాను కలిశారని ..అందుకే అమిత్ షా దర్శకత్వంలో ఏపీలో జగన్‌ను టార్గెట్ చేశారనేది ఇపుడు వినిపిస్తున్న మాట. గతంలో అనేక సార్లు జగన్‌ను పవన్ విమర్శించినప్పటికీ ఈ స్థాయిలో మాత్రం లేదు. తనని వ్యక్తిగతంగా …సీఎం విమర్శించినప్పటికీ కూడా సున్నితంగానే రిప్లై ఇచ్చారు పవన్…కానీ రాయలసీమ టూర్లో మాత్రం విమర్శల ఘాటు పెంచారు. ముఖ్యంగా జగన్… క్రైస్తవంలో సహనం ప్రధాన భూమికగా ఉంటుందని, కానీ జగన్‌కు అసలు సహనం అన్నదే లేదన్నారు. అలాగే జగన్ రెడ్డి అంటూ కులాన్నిపదే పదే ప్రస్తావించారు పవన్ కల్యాణ్.

తాజాగా పవన్ చేసిన కామెంట్స్‌తో బీజేపీకి దగ్గరవుతున్నాననే సిగ్నల్స్‌ని పవన్ ఇచ్చారు అయితే.. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.