అయోధ్య రామ మందిర నిర్మాణానికి వెల్లువెత్తుతున్న విరాళాలు.. నెలలోపే రూ.వెయ్యి కోట్లుః చంపత్ రాయ్
అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయి.
Ayodhya Ram temple : అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణను చురుకుగా సాగుతుందని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. రామాలయ నిర్మాణానికి గత నెలలో విరాళాల సేకరణ ప్రారంభమైంది. వ్యక్తిగతంగా ప్రముఖులను కలిసి విరాళాలు సేకరించే ప్రక్రియను ట్రస్ట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ట్రస్ట్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి మొదటి విరాళం స్వీకరించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ఏర్పాటు విరాళాలను సేకరిస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది.
గత నెలలో ప్రారంభించిన ప్రచారం ద్వారా అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయి. ఈ నెల రోజుల్లో మూడు జాతీయ బ్యాంకుల్లో ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయని ఆ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అన్ని దేశాల ప్రజలు ఆలయ నిర్మాణానికి ఉదారంగా విరాళం ఇచ్చారని తెలిపారు. రామాలయ నిర్మాణానికి దాదాపు 1.50 లక్షల మంది వీహెచ్‌పీ కార్యకర్తలు నిధులు సేకరిస్తున్నారని రాయ్ తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి కార్యకర్తలు నిధులు తెచ్చి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. జనవరి 15 న ప్రారంభించిన నిధుల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయని రాయ్ చెప్పారు.
పట్టణాలు, గ్రామాల్లోనూ కమిటీలను నియమించారు. నిధుల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని రామభక్తులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో జరిగే ప్రచారంలో 40లక్షల మంది పాలు పంచుకోనున్నారు. నిధుల సేకరణ, ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 5.25 లక్షల గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని బృందాల్లో ఐదు నుంచి ఏడుగురు వ్యక్తులు సభ్యులను నియమించారు. ప్రతి ఐదు పంచాయతీలపై ఓ ఫండ్ డిపాజిటర్ నియమించింది ట్రస్ట్. వారంతా సేకరించిన మొత్తాన్ని ఏ రోజుకారోజు బ్యాంకులో జమ చేస్తారు.
ఇందుకోసం ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నయా ఘాట్ శాఖలతో అయోధ్యలో ఖాతాలు ప్రారంభించారు. ప్రజలు ఆన్‌లైన్‌లోనూ విరాళాలు ఇవ్వొచ్చని కమిటీ గతంలోనే సూచించింది. 44 రోజుల పాటు విరాళాల సేకరణ నిరంతరాయంగా కొనసాగనుంది.
Read Also.. భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై ఆందోళన.. వర్క్ వీసాలు ఇవ్వొద్దంటున్న ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు