AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. మోదీ వీడియో కాన్ఫరెన్సులో కుండబద్దలు కొట్టిన సీఎం..

యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంపిణీకి సర్వం సిద్దంగా వున్నామంటూనే కేంద్ర ప్రభుత్వానికి తనదైన శైలిలో సూచనలు, హెచ్చరికలు చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. మోదీ వీడియో కాన్ఫరెన్సులో కుండబద్దలు కొట్టిన సీఎం..
Rajesh Sharma
|

Updated on: Nov 24, 2020 | 2:27 PM

Share

KCR crucial comments on vaccine distribution: శాస్త్రీయంగా ఆమోదింపబడిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో పాల్గొన్న కెసిఆర్ తన అభిప్రాయాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

“వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలి” అని కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటి విసి కరుణాకర్ రెడ్డి, కోవిడ్ నిపుణులు కమిటి సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌ నివారణ కోసం ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.