తెలంగాణ కొత్త సీఎస్ సోమేశ్ కుమార్.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా వున్న ఎస్కే జోషి స్థానంలో సోమేశ్ కుమార్‌ని నియమిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్‌ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని […]

తెలంగాణ కొత్త సీఎస్ సోమేశ్ కుమార్.. కారణం ఇదే
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 31, 2019 | 5:29 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా వున్న ఎస్కే జోషి స్థానంలో సోమేశ్ కుమార్‌ని నియమిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్‌ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మంగళవారం రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. అయిదున్నరేళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో అనేక బాధ్యతలు చేపట్టిన సోమేశ్ కుమార్ 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం అదనపు సీఎస్ హోదాలో రెవెన్యూ శాఖ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు సోమేష్ కుమార్.

వివిధ హోదాల్లో పనిచేసిన సోమేశ్ కుమార్.. తన ప్రతిబాపాటవాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకట్టుకున్నారని చెప్పుకుంటారంతా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ తొలి చీఫ్ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్ కుమార్ 2015లో జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల ఓట్లు గల్లంతైన సందర్భంలో ఈసీచే బదిలీ వేటుకు గురయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, 5 రూపాయలకు భోజనం వంటి పథకాలతో సోమేశ్ కుమార్ మంచి పేరు సంపాదించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్ శాఖల్లో ఆశించిన స్థాయిలో రెవెన్యూని రాబట్టడంలో ఆయన సక్సెస్ ఫుల్ అని అంతా చెప్పుకుంటారు. తెలంగాణకు జీఎస్టీ ఆదాయం తగ్గకుండా చూశారని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పుకుంటాయి.

నిజానికి కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై గత నెల రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. సోమేశ్ కుమార్‌ కంటే సీనియర్ అయిన అజయ్ మిశ్రా పేరు బాగా వినపడింది. అయితే.. అజయ్ మిశ్రా మరో ఆరు నెలల కాలంలోనే పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో సోమేశ్ కుమార్ రిటైర్మెంట్‌కు నాలుగు సంవత్సరాల సమయం వుంది. 2023 డిసెంబర్ 31 దాకా ఆయన సర్వీసులో వుంటారు. నాలుగు సంవత్సరాల పాటు సుస్థిరంగా పదవీ బాధ్యతల్లో వుండే ఛాన్స్ వుండడం వల్లే సోమేశ్ కుమార్ వైపు ముఖ్యమంత్రి మొగ్గుచూపారని చెప్పుకుంటున్నారు.