AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#COVID19 ఏపీలో ఇక హై అలర్ట్… లేటెస్ట్ డెసిషన్స్ మరింత టఫ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. దాంతో సోమవారం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు.

#COVID19 ఏపీలో ఇక హై అలర్ట్... లేటెస్ట్ డెసిషన్స్ మరింత టఫ్
Rajesh Sharma
|

Updated on: Apr 06, 2020 | 12:21 PM

Share

New directions from AP CM Jagan: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. దాంతో సోమవారం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏపీవ్యాప్తంగా మరిన్ని కఠిన చర్యలను అమలు పరచాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఏపీలో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు అందాయి. కరోనా పరిస్దితిపై సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తాజాగా తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. ఏదైనా అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. ఈ నిబంధనలు ధిక్కరిస్తే పోలీసులు కేసులు నమోదు చేసేందుకు వెనుకాడవద్దని తాజాగా ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్దారింపబడిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు, అనుమానం ఉన్న వారిని ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించడమో చేస్తున్నారు.

పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికి ర్యాపిడ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతర కరోనా లక్షణాలున్నట్లు అనుమానమోస్తే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్‌ ఉన్నదీ తెలుసుకుంటున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైడ్‌ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన వెంటనే ఏపీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. మర్కజ్‌ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్‌ సస్పెక్ట్‌లను ప్రభుత్వ యంత్రాంగం వేగంగా గుర్తించింది. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. అంతేకాక గుర్తించిన వారిని శరవేగంతో క్వారంటైన్‌ క్యాంప్‌లకు, ఆసుపత్రులకు తరలించారు. ఆ తర్వాత వెంటనే వారి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఆయా ప్రాంతాలు హట్‌స్పాట్‌లు ప్రకటిస్తున్నారు. ఇలా వెంటనే చర్యలు తీసుకుంటున్న కారణంగానే పాజిటివ్‌ కేసులన్నీ త్వరగా బయటికి వస్తున్నాయి.

హాట్‌ స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్తలు..

వీటితోపాటు ఒకే ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తున్నారు. ఈ హాట్‌స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల కనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ నీలంసాహ్ని వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులు, తదితరవిభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు పాజిటివ్‌ కేసులు, ‘మర్కజ్‌’ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్‌ పనులు వేగంగా చేస్తున్నారు.

హోమ్‌ క్వారంటైన్‌లపై నిఘా..

హోమ్‌ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బృందాలు నిఘా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. హోమ్‌క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనల కనుగుణంగా వ్యవహరిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోమ్‌ క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హోమ్‌ క్వారంటైన్‌ ఉంటున్నవారు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జనంలో కలుస్తున్నారని ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో వారిపై ఎప్పటికప్పడు వలంటీర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నిఘా ఉంచుతున్నారు.