‘కరోనా-స్టేజ్ 2-3 దశ మధ్య ఇండియా.. ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా

21 రోజుల లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. ఏప్రిల్ 10 తరువాతే, అంటే కరోనాకు సంబంధించి పూర్తి డేటా అందిన తరువాతే దీనిపై చెప్పగలుగుతామని ఆయన అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 4:04 pm, Mon, 6 April 20
'కరోనా-స్టేజ్ 2-3 దశ మధ్య ఇండియా.. ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా సంక్రమించే కరోనా వైరస్ ప్రస్తుతం మన దేశంలో రెండో దశలోనే ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల ఇది ‘కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్’ (మూడో దశ) లోకి ప్రవేశించిందని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక వ్యక్తులు, కొన్ని కుటుంబాల్లోని వారిలోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ముంబై వంటి ప్రాంతాల్లో మనం లోకలైజ్డ్ కమ్యూనిటీని గమనిస్తున్నాం.. అంటే ఇండియా ఇప్పుడు స్టేజీ 2 -3 దశ మధ్య ఉందని భావించవచ్చు’… కానీ దేశంలో చాలా చోట్ల  ఇంకా రెండో దశలోనే ఉండడం కొంత ఊరటనిచ్ఛే అంశం’ అన్నారాయన. పలు హాట్ స్పాట్స్ లో వ్యక్తుల మధ్య ఈ వైరస్ వ్యాపించడాన్ని ఇప్పుడే నియంత్రించవలసిన అవసరం ఉందని డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావించవచ్చునని, ఆ కార్యక్రమానికి హాజరైవారినందరినీ ట్రేస్ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ తరుణంలో డాక్టర్లకు అందరూ సహకరించాలని, వారు.. ముప్పు పొంచి ఉన్నప్పటికీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారని ఆయన చెప్పారు.

21 రోజుల లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. ఏప్రిల్ 10 తరువాతే, అంటే కరోనాకు సంబంధించి పూర్తి డేటా అందిన తరువాతే దీనిపై చెప్పగలుగుతామని ఆయన అన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి వఛ్చిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రాగలుగుతామన్నారు.