Big News Big Debate: తాండూరులో నేతల శివ తాండవం.. లోకల్‌గా పట్నంకు పొగ నిజమేనా?
Big News Big Debate: తెలంగాణలో హ్యాట్రిక్. దేశంలో కీ రోల్ అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 90కి పైగా సీట్లు గెలుస్తామని ప్రకటించిన 24 గంటల్లోపే..
Big News Big Debate: తెలంగాణలో హ్యాట్రిక్. దేశంలో కీ రోల్ అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 90కి పైగా సీట్లు గెలుస్తామని ప్రకటించిన 24 గంటల్లోపే తాండూరులో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే మధ్య టికెట్ వార్ మొదలైంది. ఫోన్ ఆడియోతో మొదలైన గాలిదుమారం కాస్తా పొలిటికల్ తుఫాన్‌గా మారింది. టికెట్ నాదంటే నాదని నేతలు రోడ్డెక్కారు. కొంతకాలంగా జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచే వీరి మధ్య ఫైట్ ప్రారంభమైంది.
ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే వికారాబాద్ జిల్లాలో రాజకీయం రాజుకుంది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాండూర్ టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. సీఐ ని అసభ్యకరంగా తిడుతున్న ఆడియో లీకైంది. సీఐని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నావంటూ ఫైరయ్యారు మహేందర్ రెడ్డి. ఇక సీఐ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగిన ఆడియో ఆధారంగా మహేందర్ రెడ్డిపై కేసు నమోదయింది. ఇదే ఎమ్మెల్యే – ఎమ్మెల్సీ మధ్య మరోసారి అగ్గి రాజేసింది. కుట్రపూరితంగా ఆడియోలు లీకు చేస్తున్నారని.. సీఐతో మాట్లాడింది నిజమే అయినా అందులో మాటలు తనవి కాదంటున్నారు పట్నం. తాండూరులో మొన్న సర్పంచ్‌ల తొలగింపు.. ఇవాళ ఆడియో రిలీజ్‌లు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ పట్నం. వచ్చే ఎన్నికల్లో.. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానంటున్నారు మహేందర్ రెడ్డి.
తాండూరులో తాను పనిచేసుకుంటుండగానే.. ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడమే అంటున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాండూరు టిక్కెట్ తనదేనంటూ కుండబద్దలు కొట్టేశారు పైలెట్. సీఐతో బూతుపురాణంలో ఆడియో వాయిస్ తనది కాదని బుకాయిస్తే రేపయినా నిజాలు బయటికొస్తాయని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తన పనితీరుపై అటు ప్రజలు ఇటు పార్టీ అధిష్టానం సంతృప్తిగా ఉందని.. 100 శాతం టికెట్ తనకే దక్కుతుందంటున్నారు.
పిల్లి, ఎలుకల్లా కీచులాడుకుంటున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వివాదంను హైకమాండ్ సీరియస్‌గానే తీసుకుందట. మంత్రి కేటీఆర్ నజర్‌కు వీరి పంచాయతి వెళ్లిందని.. రోహిత్‌రెడ్డి కేటీఆర్‌తో ఇప్పటికే భేటీ అయ్యారని.. తాండూరులో ఏం జరుగుతోందని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరా తీశారంటున్నారు. అటు ఎమ్మెల్సీ పట్నం కూడా కేటీఆర్‌ను కలుస్తారని చెబుతున్నారు. మొత్తానికి సొంతపార్టీలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య తాజా రచ్చ ఎన్నికల సమయానికి హైకమాండ్ చల్లారుస్తుందా. మరింత ఎగసిపడుతుందా చూడాలి.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..