AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: వృషభ రాశిలో శుక్రుడు.. ఆ రాశులకు కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

Shukra Gochar: శుక్ర గ్రహం వృషభ రాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారు అనుకూల ఫలితాలు పొందనున్నారు. కుటుంబ సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దాంపత్య జీవితంలో సుఖం పెరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సమన్వయం, ఆదాయ వృద్ధి, దాంపత్య సామరస్యం వంటివి ఈ కాలంలో జరుగుతాయి.

Shukra Gochar: వృషభ రాశిలో శుక్రుడు.. ఆ రాశులకు కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Venus Transit in Taurus
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2025 | 1:52 PM

Share

Venus Transit 2025: శుక్ర గ్రహానికి చెందిన వృషభ రాశి జాతక చక్రంలో సహజమైన కుటుంబ, ఆదాయ స్థానం. ఈ వృషభ రాశిలో స్వయంగా రాశినాథుడే సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, విడాకుల కేసులు తేలిపోవడం, దాంపత్య సమస్యలు సమసిపోవడం, ఆర్థిక పరిస్థితి చక్కబడడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడికి అనుకూలంగా ఉన్న రాశులు ఈ గ్రహం వల్ల అనేక విధాలుగా సానుకూల పరిణామాలను, శుభ పరిణామాలను అనుభవించడం జరుగుతుంది. ఈ నెల 26న వృషభ రాశిలో ప్రవేశించిన శుక్ర గ్రహం జూలై 26 వరకూ అదే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులను శుక్ర గ్రహం ఈ విషయాల్లో అనుగ్రహించబోతోంది.

  1. మేషం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. రాజీమార్గంలో విడాకుల కేసులు తొలగిపోతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  2. వృషభం: రాశినాథుడు శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. విడాకుల కేసులు రద్దయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. జీవిత భాగస్వామి తరఫున ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  3. కర్కాటకం: లాభ స్థానాధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది. జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం వల్ల ప్రేమ ప్రయత్నాల్లో ఘన విజయం సాధిస్తారు. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. కుటుంబ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. దంపతుల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం, అన్యోన్యత పెంపొందుతాయి. ధన యోగాలు, రాజయోగాలు తప్పకుండా కలుగుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి జరుగుతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. విడాకుల కేసులు సఫలం కాకపోవచ్చు. దాంపత్య జీవితంలో సమస్యలు, విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. కుటుంబ జీవితం కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. సంతానం కలిగే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల వల్ల విశేషంగా లబ్ధి పొందుతారు.