రాహు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగాలు గ్యారంటీ!
Rahu Gochar: కుంభ రాశిలో రాహువు స్వతంత్ర సంచారం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి విదేశీ యానం, ఉద్యోగాలు, స్థిరపడే అవకాశాలు మెరుగుపడనున్నాయి. విదేశాల్లో కెరీర్, సంపాదన విషయంలో శుభ ఫలితాలు పొందే సమయం ఇది.

Foreign Job
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహు గ్రహం విదేశీ భాషలకు, విదేశీ అలవాట్లకు, విదేశీ ఉద్యోగాలకు కారకుడు. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాహువు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకునే అదృష్టం పడుతుంది. గత ఆరు నెలలుగా ఇతర గ్రహాలతో కలిసి ఉన్న రాహువు ఇప్పటి నుంచి డిసెంబర్ 5 వరకూ కుంభ రాశిలో ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారి కల నిజం అవుతుంది. వీరికి విదేశీ యానం, విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరత్వం, విదేశీ సంపాదన వంటివి కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు ఇక నుంచి విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. మే చివరి లోగా ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇతర దేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొన్ని విదేశీ కంపెనీల నుంచి ఆహ్వానాలు అందే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం తప్పకుండా కలుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు ఒంటరి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తులవారికి విదేశాల్లో డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. జూన్ లో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
- మిథునం: విదేశాలకు సంబంధించిన తొమ్మిదవ స్థానంలోనే రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విదేశీ ఉద్యోగాల్లో స్థిరపడే యోగం పడుతుంది. ఈ రాశికి చెందిన వృత్తుల వారు కూడా విదేశీ సంపాదన అనుభవించడం జరుగుతుంది. విదేశీ పర్యటనలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. జూన్ లో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు ఎక్కువగా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది.
- తుల: ఈ రాశికి అయిదవ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు విదేశీ ఉద్యోగ నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఇక విదేశీ అవకాశాలు లభించడం ప్రారంభం అవుతుంది. వీరి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగి, విదేశాల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత పదవులు, భారీ సంపాదన పొందే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాహువు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నందువల్ల, దాన్ని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆశించిన విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా అనేక దేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కలుగుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు అంది వస్తాయి.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు ఒంటరి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అనేక విధాలుగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Follow Us



