Money Astrology: కాలసర్ప దోషం.. 10 రోజుల్లో ఆ రాశుల వారికి ఆకస్మిక ధన వృద్ధి!
Kaal Sarp Dosha: మే నెల 21 నుండి జూన్ 1 వరకు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. గురు గ్రహం అనుకూల స్థానం వలన వృషభం, మిధునం, సింహం సహా మరికొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. అయితే వీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులను నివారించాలి. కొన్ని రాశులకు ఉద్యోగం, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Kaal Sarp Dosha
ఈ నెల(మే) 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు చంద్రుడితో సహా గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య పడడం జరుగుతోంది. గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య పడినప్పుడు ఆ పరిస్థితిని జ్యోతిష శాస్త్రంలో ‘కాలసర్ప దోషం’గా అభివర్ణించడం జరిగింది. నిజానికి ఇది ఒక అవయోగమే అయినప్ప టికీ, ఈ పది రోజుల కాలంలో గురు బలం వల్ల కొన్ని రాశులకు మాత్రం ధన యోగాలు కలిగే అవ కాశం ఉంది. గురువు కేంద్ర స్థానాల్లో ఉన్నా, అనుకూలంగా ఉన్నా ఈ కాలసర్ప దోషం వల్ల కలిగే నష్టాలు బాగా తక్కువగా ఉంటాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి ఈ అవయోగం వల్ల పెద్దగా ఇబ్బందులు కలగకపోవచ్చు. కొద్దిగా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉండవచ్చు.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి, కుటుంబ జీవితానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగంలో దూకుడు, వేగాలను తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గినా సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
- మిథునం: ఈ రాశిలో గురు సంచారం వల్ల కాలసర్ప దోషం చాలా తగ్గుస్థాయిలో పట్టే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. అనవసర పరిచయాలకు, అనవ సర వ్యయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
- సింహం: ఈ రాశిలోనే కాలసర్ప దోషం పడుతున్నప్పటికీ, లాభస్థానంలో ఉన్న గురువు ఆర్థిక, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల సంబంధమైన కష్టనష్టాల నుంచి కాపాడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు యథావిధిగా సాగిపోతాయి. అనుకోని ఖర్చులు, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు, మదుపులు, పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రులను కూడా అతిగా నమ్మకపోవడం మంచిది. అనారోగ్యానికి అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి దశమ కేంద్రంలో గురు సంచారం వల్ల రాహుకేతువుల దోషం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అయితే, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. ఉద్యోగంలో ప్రాధాన్యానికి భంగమేమీ ఉండదు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ కేంద్రంలో గురు సంచారం వల్ల కాలసర్ప దోషం ఎక్కువగా బాధించే అవకాశం లేదు. ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు. ఆరోగ్యం బాగానే సాగిపోతుంది. ఉద్యోగంలో అధికార యోగం, ధన యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్తగా ప్రయత్నాలు తలపెట్టకపోవడం మంచిది. కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
- మీనం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల రాహుకేతువుల దోషం పెద్దగా వర్తించే అవకాశం ఉండకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదాల జోలికి పోవద్దు. కుటుంబంలో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.



