Sthira Yoga: శని గ్రహ ప్రభావంతో ఆ రాశులవారికి స్థిర యోగం.. అనూహ్య యోగంతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతారు..
శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశుల వారికి మేలు చేయటమే జరుగుతుంది తప్ప కష్ట నష్టాలు కలిగించే అవకాశం లేదు. పైగా, శని తన స్వస్థానంలో సంచరించడం ఈ నాలుగు రాశులకు అనూహ్యంగా యోగం కలగజేస్తుంది.
Telugu Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం తమ రాశి నుంచి శని ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాలలో సంచరించడం అవయోగాలకు, యోగ భంగాలకు కారణం అవుతుంది. ఆ రకంగా చూస్తే కుంభరాశి లేదా కుంభ లగ్నానికి ఒకటవ రాశి లోను, వృశ్చిక రాశికి నాలుగవ స్థానంలోనూ, సింహరాశికి ఏడవ స్థానంలోనూ, వృషభ రాశికి పదవ స్థానంలోనూ శని సంచరించడం జరుగుతోంది. ఈ రాశుల వారికి శని సంచారం వల్ల కష్టనష్టాలు అనుభవం లోకి రావాలి.
అయితే, శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశుల వారికి మేలు చేయటమే జరుగుతుంది తప్ప కష్ట నష్టాలు కలిగించే అవకాశం లేదు. పైగా, శని తన స్వస్థానంలో సంచరించడం ఈ నాలుగు రాశులకు అనూహ్యంగా యోగం కలగజేస్తుంది. ఈ నాలుగు రాశులకు శని కేంద్ర స్థానాలలో అంటే ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాలలో శశ యోగం అనే ఒక మహా పురుష యోగాన్ని కలిగిస్తాడు. ఈ యోగం వల్ల ఈ రాశుల వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ వారి స్థానాన్ని సుస్థిరం చేయడం తప్పకుండా జరుగుతుంది. వారి వారి రంగాలలో వారు తప్పకుండా తమ శక్తి యుక్తులతో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి శనీశ్వరుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇదే స్థానంలో శని 2025 జూలై వరకు ఉంటాడు. పదవ స్థానం అంటే ఉద్యోగం, వ్యాపారం, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన స్థానం అన్నమాట. అందువల్ల ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం సంపాదించుకుంటారు. తమ ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలోనూ, సామాజిక సేవారంగంలోనూ, చలన చిత్ర రంగంలోనూ ఉన్నవారు బాగా ఎదిగిపోతారు. వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి శని సప్తమంలో సంచరిస్తూ శశ యోగాన్ని కల్పిస్తున్నాడు. సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి సంబంధించిన స్థానం. శనీశ్వరుడు ఈ సప్తమ స్థానంలో సంచరించడం వల్ల మంచి కుటుం బంలో లేదా సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొం టున్న వారికి ఉపశమనం లభిస్తుంది. పెద్దల జోక్యంతో వైవాహిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములతో సమస్యలు, విభేదాలు, వివాదాలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి శనీశ్వరుడు నాలుగవ రాశిలో అంటే సుఖస్థానంలో సంచరిస్తున్నాడు. నిజానికి నాలుగో స్థానంలో శని సంచరించడాన్ని అర్ధాష్టమ శనిగా పేర్కొంటారు. దీనివల్ల కుటుంబ పరంగా, గృహ, వాహనాల పరంగా కష్టనష్టాలను అను భవిస్తారని, మనశ్శాంతి, ప్రశాంతత ఉండ వని భావిస్తారు. అయితే, వృశ్చిక రాశి వారికి శని ఈసారి శశ యోగాన్ని కల్పిస్తున్నందువల్ల, ఈ రాశి వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఈ రాశి వారికి సొంత గృహం అనే కల నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. కలతలు, కలహాలు పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందుతాయి. బంధు వర్గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది.
కుంభ రాశి
శని కుంభరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నట్టుగా భావించాలి. ఏలినాటి శని వల్ల కష్టాలే తప్ప సుఖాలు ఉండవని అందరూ భావించడం జరుగుతుంది. అయితే, శనికి ఈ రాశి స్వ క్షేత్రం అయినందువల్ల ఈ రాశి వారిని బాధించే అవకాశం లేదు. పైగా, శశయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనూహ్యమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రెండున్నర ఏళ్ల కాలంలో తమ తమ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
కొన్ని పరిహారాలు
నిజానికి ఈ నాలుగు రాశుల వారికి శనీశ్వరుడివల్ల ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. అయితే, ఎటువంటి పరిస్థితులలోనూ శనిని దూషించకపోవడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. అంతేకాక తరచూ శివాలయానికి వెళ్లి శివుడిని అర్పించడం వల్ల శుభ ఫలితాలు త్వరగా అనుభవానికి వస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకుంటే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నట్టే లెక్క.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..