Vijayawada: ఉత్కంఠకు తెర.. అలకవీడిన మల్లాది విష్ణు.. వెల్లంపల్లికి రూట్ క్లియర్.!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నారాయన. నియోజకవర్గంలో వెలంపల్లి నేడు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నారాయన. నియోజకవర్గంలో వెలంపల్లి నేడు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
వైసీపీ అధిష్టానం తీరుపై కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్‌ఛార్జ్‌ల మార్పులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించింది వైసీపీ. అప్పటి నుంచి మల్లాది విష్ణు మౌనంగా ఉండిపోయారు. గతంలో రెండుసార్లు అధిష్టానం పెద్దలు పిలిచి మాట్లాడినా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. వెలంపల్లికి సహకారం విషయంలో తన కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిపై వెల్లంపల్లి నిర్వహించిన సమావేశానికి ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరుకాలేదు. దీంతో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త ఇన్‌ఛార్జ్ వెల్లంపల్లికి సహకారం అందించాలని కోరినప్పటికీ విష్ణు మాత్రం తన మనసులో ఏముందో చెప్పలేదు. మరోవైపు విష్ణుకు సీటు ఇవ్వలేదని మొదట్లో హడావుడి చేసిన స్థానిక కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా వెల్లంపల్లి బాట పట్టారు.
నాలుగు రోజుల క్రితమే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో తన కార్యక్రమాలు ప్రారంభించారు. పాయకాపురంలో పలు ఆలయాల్లో పూజలు చేసి తన పర్యటనలు ప్రారంభించారు. మల్లాది విష్ణును పిలిచినా రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే లేకుండానే తన పర్యటనలు ప్రారంభించి కొనసాగిస్తున్నారు. ఇదంతా కొనసాగుతుండగానే సెంట్రల్ నియోజకవర్గంలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెల్లంపల్లి ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి సజ్జలతో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌లు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి విష్ణు హాజరవుతారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే దీనికి కొన్ని గంటల ముందు మల్లాది విష్ణు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యం అని కేడర్ కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. అయితే విష్ణు నిర్ణయాన్ని ఆయన కేడర్ వ్యతిరేకించింది. వెల్లంపల్లికి సహకరించేది లేదంటూ కాసేపు ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మల్లాది విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠకు తెరపడింది. నియోజకవర్గంలో వెల్లంపల్లికి రూట్ క్లియర్ అయింది.
