సాగర తీరంలో స్టీల్ పాలిటిక్స్…! విశాఖ ఉక్కు పోరాటానికి పరిరక్షణ యాత్రతో నాంది పలికామన్న విజయసాయిరెడ్డి
Steel Politics : సాగర తీరంలో స్టీల్ పాలిటిక్స్...! విశాఖ ఉక్కు పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రతో నాంది పలికామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Steel Politics : సాగర తీరంలో స్టీల్ పాలిటిక్స్…! విశాఖ ఉక్కు పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రతో నాంది పలికామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దన్నదే ప్రధాన డిమాండ్ అని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లోపల, బయట ఉద్యమాన్ని కొనసాగిస్తామన్న ఆయన… స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఢిల్లీలోనూ, గల్లీలోనూ పోరాడుతామన్నారు. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారని… 1977లో ఢిల్లీ, విశాఖ వేదికగా ఉక్కు పోరాటం సాగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాగే పోరాటం కొనసాగిస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణపై కేంద్రానికి సీఎం జగన్ ఇప్పటికే పీఎంకు లేఖరాశారన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి వైసీపీ స్టాండ్ తెలియజేశామన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టామని చెప్పారు. 32 మంది త్యాగాలు చేస్తే స్టీలు ప్లాంట్ ఏర్పడిందని… స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అవంతి స్పష్టం చేశారు.
కాగా, విశాల సముద్రతీరంలో రాజకీయాలు మొత్తం ఉక్కు ఉద్యమం చుట్టే తిరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న విజయసాయిరెడ్డి… పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.
విజయసాయి పాదయాత్రలో మంత్రులు కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటు.. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి, కార్మిక సంఘాలు పాల్గొనున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన యాత్ర… ఐదు నియోజకవర్గాల మీదుగా 25 కిలోమీటర్లు కొసాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, డైమండ్ పార్క్, దొండపర్తి, మర్రిపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, ఎయిర్పోర్ట్, షీలానగర్ మీదుగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు యాత్ర కొనసాగుతుంది. అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.