Anam Ramanarayana Reddy: ఏం చేశామని ఓట్లు అడుగుతాం.. వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు..
తమ పార్టీ ప్రభుత్వంపైనే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాపూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి..

తమ పార్టీ ప్రభుత్వంపైనే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాపూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రజలకు ఏమీ చెయ్యలేకపోతున్నామంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సమావేశంలో ఆనం మాట్లాడుతూ.. అప్పట్లో టీడీపీని తిట్టిపోశాం.. కనీసం ఎస్.ఎస్ కెనాల్‌కు శంకుస్థాపన కూడా చెయ్యలేకపోయామంటూ వేదికపైనున్న ఇతర వైసీపీ నేతలనే ఉద్దేశించి మాట్లాడారు. రోడ్లు వెయ్యలేకపోయాం, చివరికి గుంతలూ పూడ్చలేకపోతున్నాం. తాగు నీరు అడిగితే కేంద్రం పేరు చెబుతున్నాం. ఇక మనం ఎందుకని జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు.
పెన్షన్లకే ఓట్లేస్తామా? పెన్షన్లు గత ప్రభుత్వంలో లేవా? వెయ్యిరూపాయలు ఎక్కువ ఇస్తే ఓట్లు పడతాయా..? అని కూడా పేర్కొన్నారు. పనులు చెయ్యకుండా జనం ఎందుకు నమ్ముతారంటూ ప్రశ్నించారు. ఇల్లు కడతామని లేఅవుట్ వేసినా ఇప్పటికీ కట్టలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆనం పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనను కూడా నమ్మే పరిస్థితిలో లేరంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఎస్‌ఎస్ కెనాల్ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పానని.. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించానని తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ గెలవాలని ఉన్నా, మార్గమేదని ప్రశ్నించిన ఆనం.. జనానికి నమ్మకం పోతే ఓట్లు వేస్తారా అంటూ వ్యాఖ్యానించారు.




ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాతోపాటు.. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
