బెదిరింపులకు భయపడను.. వైఎస్సార్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ..!
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన వేంపల్లి చేరుకున్నారు.

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేసినందుకు గాను కడప జిల్లా వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణకు హాజరయ్యేందుకు ఆయన బుధవారం (ఏప్రిల్ 29) సాయంత్రం వేంపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన, కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేస్తూ.. సాధ్యపడని అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. “ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం చేసే కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతామని ఈ పవిత్ర స్థలంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అప్పుడు తిరుమల నుంచి ఇచ్చాపురం వరకు నడవలేమని భావించాం, కానీ ఆయన ఇచ్చిన మనోధైర్యంతోనే ఆ యాత్రను విజయవంతం చేశాం. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలను, వేధింపులను తట్టుకునే శక్తిని, గుండె ధైర్యాన్ని ఆ వైఎస్సారే ప్రసాదిస్తారని నమ్ముతున్నాను” అని అంబటి పేర్కొన్నారు.
తనపై ఉన్నవి కేవలం రాజకీయ విమర్శలకు సంబంధించిన కేసులేనని, ఎటువంటి అవినీతి లేదా ఇతర అక్రమ కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం భయపెట్టాలని, అరెస్టులు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. విచారణకు సహకరించేందుకే తాను ఇక్కడికి వచ్చానని, పోలీసుల నోటీసుల మేరకు వేంపల్లి, పులివెందుల స్టేషన్లకు హాజరవుతున్నట్లు తెలిపారు. అంబటి పర్యటన నేపథ్యంలో కడప జిల్లాలో వైసీపి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
