ఘోర ప్రమాదం.. వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిప్పురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కుట్టిప్పురం సమీపంలో కోజికోడ్ నుంచి త్రిస్సూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వర్షం కురుస్తున్న సమయంలో ప్రయాణిస్తున్న బస్సు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు బోల్తా పడి, డివైడర్ అవతలి వైపున నిలిపి ఉంచిన కారుపై పడింది. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో మరింత పెద్ద విషాదం తప్పింది. ఆ కారు అంతకుముందే మరో ప్రమాదానికి గురవడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది.
Kerala: One killed and several injured after private bus overturns at Kuttippuram in Malappuram. pic.twitter.com/6fBficVTlU
— News Arena India (@NewsArenaIndia) July 26, 2026
ప్రమాదం అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను సమీపంలోని తాలూకా ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక వర్షం కారణంగా బస్సు అదుపుతప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది.
ఈ ప్రమాదంతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడిన బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన ప్రాంతం ఇప్పటికే ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఇదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తుచేస్తూ, ఆ మార్గంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
