ఏపీలోని అధికార వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతలపై ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై జనసేనాని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వైఎస్‌ఆర్ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి ఏపీలో ఉన్న మొత్తం వైఎస్‌ఆర్ సీపీ కాపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ విమర్శలకు వైసీపీలోని కాపు నాయకుల కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతూనే ఉంది. ఇటీవల జనసేనాని విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. విశాఖలో చోటు చేసుకున్న సంఘటనలతో ఆ రెండు పార్టీల మధ్య మరింత అగ్గిని రాజేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీలో ఉన్న కాపు కులానికి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనను విమర్శించే విషయంలో కొన్ని హద్దులను పాటించాలని.. లేదంటూ తీవ్ర పరిణామాలుంటాయని ఏకంగా కాపు నేతలకు చెప్పు చూపిస్తూ మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..