అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో పస లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పిందే అమిత్ షా చెప్పారన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు. డీబీటీ ద్వారా 2 లక్షల 70 వేల కోట్లు ప్రజలకు అందజేశామన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏ బ్యాంకు లెక్కలు తీసినా అర్థమవుతుందని అన్నారు. నాడు – నేడు ద్వారా స్కూళ్లను అభివృద్ది చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 95 శాతం మంది ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అవసరమా కాదా అనే దానిపై సర్వే చేయించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
చంద్రబాబు అవినీతి చూసే జనం తిరస్కరించారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని నాడు ప్రధాని మోదీ అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారన్నారు. కావాలంటే కేంద్రం లెక్కలు చూసుకోవాలన్నారు. కేంద్రం నిధులు సరిగా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందన్నారు. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తి చేస్తారన్నారు. ఆ శక్తి ఆయనకు ఉందని తెలిపారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆపాలని భూకబ్జాదారులు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ యాక్ట్ అమలు కాకుండా చంద్రబాబు రాక్షస ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.