AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulasa Fish: కిలోంపావు పులస చిక్కింది.. వేలంలో ఎంత పలికిందంటే..?

గోదావరి జిల్లాల్లో ఎంతో క్రేజ్ ఉన్న పులస చేపకు యానాంలో మరోసారి భారీ ధర పలికింది. గౌతమి గోదావరి నది, బలుసుతిప్ప వద్ద మత్స్యకారుల వలకు చిక్కిన 1.25 కిలోల పులస చేపను యానాం రేవులో బహిరంగ వేలం వేశారు. పోటాపోటీగా సాగిన వేలంలో ..

Pulasa Fish: కిలోంపావు పులస చిక్కింది.. వేలంలో ఎంత పలికిందంటే..?
Pulasa Fish
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2026 | 5:47 PM

Share

“పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే” అనే నానుడి గోదావరి జిల్లాల్లో ఎంత ప్రసిద్ధమో అందరికీ తెలిసిందే. గోదావరి వరద నీటిలో మాత్రమే లభించే ఈ అరుదైన, రుచికరమైన పులస చేపకు మార్కెట్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా యానాంలో వలలో చిక్కిన ఒక పులస చేప మళ్లీ ఆ రికార్డు స్థాయి ధరను రీక్రియేట్ చేసింది.

యానాం సమీపంలోని గౌతమి గోదావరి నది, బలుసుతిప్ప వద్ద మత్స్యకారులు ఎప్పటిలాగే వేటకు వెళ్లారు. చేపల కోసం వలవేయగానే అరుదైన పులస చేప చిక్కింది. ఈ చేప బరువు సుమారు 1 కేజీ 250 గ్రాములు ఉంది. తీరానికి తీసుకువచ్చిన ఈ పులసను చూడటానికి స్థానికులు, ఫిష్‌ ప్రియులు ఆసక్తి చూపారు. అనంతరం యానాం రేవులో ఈ పులస చేపకు బహిరంగ వేలం నిర్వహించారు. పోటీ తీవ్రంగా సాగిన ఈ వేలంలో మత్స్యకార మహిళ ఆకుల సత్యవతి ఏకంగా రూ. 22,000 చెల్లించి ఈ కేజీపావు పులసను సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ చేపను భీమవరానికి చెందిన వర్మరాజు అనే వ్యక్తికి విక్రయించినట్లు సత్యవతి తెలిపారు.

సాధారణంగా శ్రావణ, భాద్రపద మాసాల్లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు సముద్రం నుంచి ఈ చేపలు నదికి ఎదురీనుకుంటూ వస్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో ఇంకా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో మత్స్యకారుల వలలకు అడపా దడపా ఈ పులసలు చిక్కుతున్నాయి. ఎంత ధర అయినా సరే పులస రుచి చూడాల్సిందేనని భావించే మాంసప్రియులు ఉండటంతో ఈ వేలంలో పులసలకు బంగారం లాంటి ధర పలుకుతోంది.

Follow Us