AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి తిరుమలకు.. చివరకు నిరాశతో వెనుదిరిగిన కుటుంబం.. ఏం జరిగిందంటే

తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్ల పేరుతో ఓ కుటుంబం మోసపోయినట్లు ఫిర్యాదు చేసింది. వాట్సాప్‌లో వచ్చిన టీటీడీ లోగోతో కూడిన లింక్ ద్వారా ఒక్కొక్కటి రూ.500 చొప్పున మూడు టికెట్లు కొనుగోలు చేయగా, దర్శనం కౌంటర్ వద్ద అవి నకిలీవని తేలింది. ఈ ఘటనపై బాధితుడు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి తిరుమలకు.. చివరకు నిరాశతో వెనుదిరిగిన కుటుంబం.. ఏం జరిగిందంటే
Tirumala Fake Tickets
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2026 | 8:26 AM

Share

శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలనే తిరుమలకు వెళ్లిన ఒక కుటుంబానికి ఘోర పరాభవం ఎదురైంది. వాట్సాప్‌లో వచ్చిన ఒక నకిలీ లింక్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి, తీరా క్యూలైన్ వద్దకు వెళ్లాక అవి నకిలీవని తేలడంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై తిరుగుప్రయాణమయ్యారు. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వై.యల్లయ్య మొబైల్‌కు ఈ నెల 5న టీటీడీ (TTD) అధికారిక లోగోతో ఉన్న ఒక యాప్ లింక్ వాట్సాప్ గ్రూప్‌ ద్వారా వచ్చింది. స్వామివారి దర్శనం సులభంగా లభిస్తుందనే నమ్మకంతో, ఆయన మరొకరి సహాయంతో ఆ లింక్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి రూ.500 చొప్పున మూడు వీఐపీ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు.

అనంతరం ఫోన్ కు వచ్చిన కన్ఫర్మేషన్ స్లిప్పులను జిరాక్స్ సెంటర్‌లో ప్రింట్ కూడా తీసుకున్నారు. ఆ పత్రాలపై అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు దర్శన సమయం కేటాయించినట్లు ఉంది. దీంతో తిరుమల వెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

కౌంటర్ వద్ద బయటపడ్డ అసలు నిజం:

నిర్ణీత సమయానికి కుటుంబసభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా తిరుమలలోని వీఐపీ దర్శన కౌంటర్ వద్దకు చేరుకున్న యల్లయ్య.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తమ వద్ద ఉన్న టికెట్ ప్రింట్‌లను చూపించారు. ఆ కాగితాలను పరిశీలించిన టీటీడీ సిబ్బంది.. అవి దేవస్థానం జారీ చేసిన అసలైన టికెట్లు కావని, పూర్తిగా నకిలీవని తేల్చిచెప్పారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆ కుటుంబం.. సర్వదర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే అవకాశం లేక నిరాశతో తిరుగుముఖం పట్టి స్వగ్రామానికి చేరుకుంది.

పోలీసులకు ఫిర్యాదు

ఈ మోసంపై తిరుమల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వై.యల్లయ్య తెలిపారు. సైబర్ ముఠాల చేతిలో మోసపోయిన అనుభవాన్ని వివరిస్తూ.. ఇతర భక్తులెవరూ ఇటువంటి అనుమానాస్పద యాప్‌లు, వాట్సాప్ లింక్‌లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. అలాగే ఇటువంటి నకిలీ యాప్‌ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాంటి వాటిని నమ్మోద్దంటూ సూచిస్తోంది.. సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలని.. దళారులను, ఇలాంటి ఫేక్ మెస్సెజ్ లింకులను నమ్మోద్దంటూ అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us