ఆ ఇద్దరు భారత రత్నాలు.. విఫలమయ్యారని వదిలేస్తారా.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..!
Anjum Chopra Comments on Rohit Sharma Virat Kohli: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్, కోహ్లీ విఫలమైనా వారు భారత రత్నాలని అంజుమ్ చోప్రా అండగా నిలిచారు. ప్రతి ఇన్నింగ్స్ వారికి కీలకమని, నిరూపించాల్సింది ఏమీ లేదని అన్నారు.

Anjum Chopra Comments on Rohit Sharma Virat Kohli: ఒక చెడ్డ సిరీస్‌తో చాంపియన్లను అంచనా వేయలేం. న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా వారికి బలమైన అండగా నిలిచారు. వారు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదని, వారు “జ్యూయల్స్ ఆఫ్ ఇండియా” అని తేల్చి చెప్పారు. ఇది కేవలం మద్దతు ప్రకటన కాదు. సీనియర్లపై జరుగుతున్న అకాల చర్చకు చెక్ పెట్టే ప్రయత్నంగా చెప్పుకోచ్చారు.
న్యూజిలాండ్‌లో ఏం జరిగింది?
గణాంకాలు నిజంగానే నిరాశపరిచాయి. 4 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం 30 పరుగులే చేశాడు. అందులో 2 డకౌట్లు, అత్యధిక స్కోరు 23 మాత్రమే. కోహ్లీ 4 ఇన్నింగ్స్‌ల్లో 86 పరుగులు చేశాడు. ఆక్లాండ్‌లో విజయానికి కారణమైన 74 పరుగుల ఇన్నింగ్స్ ఒక్కటే భారత్ తరపున మొత్తం సిరీస్‌లో ఏకైక హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అయితే ఒక్క సిరీస్‌తో వారిని తీసిపారేయడం సరికాదని అంజుమ్ అంటున్నారు.
ANIతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి: “వాళ్లు ఇంత క్రికెట్ ఆడారు, వారి ప్రదర్శన గురించి ఎవరూ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్‌లో వారి బ్యాట్ నుంచి పరుగులు రాలేదని మనం బాధపడితే, వారు మనకంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ బాధపడుతుంటారు. ఎందుకంటే ఈ స్థాయికి రావడానికి వారు ఎంత కష్టపడ్డారో వారికి తెలుసు. వారిద్దరూ భారత రత్నాలు.”
“ప్రతి మ్యాచ్ వారికి లెక్కే”..
అంజుమ్ ప్రకారం, వారికి ప్రతి మైదానంలోకి దిగడం లెక్కే. అభిమానులుగా వారు సక్సెస్ కావడం మనకు ఎంత ముఖ్యమో, వారికి అంతకంటే ముఖ్యం. “వారికి ప్రతి అవకాశం కీలకం. వారు ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వారు అప్పటికే వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, అప్పటికే చాంపియన్లు. వారు తిరిగి ప్రాక్టీస్ చేసి, కష్టపడి, తమకు తాము ఏది అత్యుత్తమ ప్రదర్శన అనుకుంటారో అది ఇచ్చే రోజు కోసం ఎదురుచూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.”
ఈ ఏడాది గణాంకాలు చూస్తే ఆమె మాటలు అక్షరసత్యమనిపిస్తాయి. కోహ్లీ 2026లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు, 13 ఇన్నింగ్స్‌ల్లో 53.16 సగటుతో 638 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోరు 139*, స్ట్రైక్ రేట్ 118.60!
రోహిత్ కూడా 17 మ్యాచ్‌లు, 16 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటు, 101 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో 634 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు, అత్యధిక స్కోరు 138. ఒక్క సిరీస్ వైఫల్యంతో ఈ రికార్డును చెరిపేయలేం. ఇద్దరూ డిసెంబర్ 13 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగనున్నారు.
గిల్‌పై ప్రశంసలు – వెల్లింగ్టన్ సవాల్‌ను ఆస్వాదిస్తాడు..!
వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టుపై మాట్లాడుతూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై అంజుమ్ నమ్మకం వ్యక్తం చేశారు. 2018లో న్యూజిలాండ్‌లోనే U-19 వరల్డ్ కప్‌ను వైస్ కెప్టెన్‌గా గెలిచి, ఐదు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 372 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన చరిత్రను గుర్తుచేశారు.
“టెస్టుల కోసం అందరూ సిద్ధమవుతున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ చివరి వన్డేకు దూరంగా ఉన్నారు. ప్రిపరేషన్ మూడ్రోజుల ముందు నుంచే మొదలుపెట్టారు. న్యూజిలాండ్‌లో ఆడాలని తెలిసినప్పటి నుంచే క్రికెటర్లు వ్యక్తిగతంగా సన్నద్ధమవుతారు. గిల్ ఈ సవాల్‌ను ఆస్వాదిస్తాడని నా నమ్మకం. 2018లో అక్కడే కప్ గెలిచాడు, ఆ తర్వాత రెండుసార్లు న్యూజిలాండ్ వెళ్లాడు.”
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




