Andhra: బాతులు మేపుతుండగా గర్భిణీకి పురిటినొప్పులు.. వైద్యసాయం కోసం పరుగుపరుగున వెళ్లిన భర్త.. ఇంతలోనే
బిడ్డకు జన్మ నివ్వటం అంటే మరోసారి తల్లి పునర్జన్మ పొందటం అంటారు. ఐసియూలో వైద్యుల పర్యవేక్షణలో ప్రసవించే అవకాశం అందరు మాతృమూర్తులకు ఉండదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో కొండల్లో నివసించే వారిని డోలి ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు బంధువులు మోసుకువస్తుంటారు. ఇలాంటి సమయంలో అత్యవసర వైద్యసహాయం అందకపోతే తల్లి బిడ్డ ప్రాణాల మీదకు రావచ్చు. ఇలానే కూలి నాలి చేసుకునే కష్టజీవులు, వలస ప్రాంతాల్లో జీవించే వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బాతులు మేపుకుంటూ జీవించే కుటుంబానికి చెందిన మహిళకు పురిటినొప్పులు రావటంతో పొలం గట్టుపైనే ప్రసవం జరిగింది. ఈ ఘటన మత్స్యపురిలో జరిగింది.

రోజూలాగే ధాన్యం కోసిన పొలంలో గంధం స్వామీ, నాంచారమ్మలు బాతులను మేపు తున్నారు. అప్పటికే నాంచారమ్మ నిండు గర్బవతి. కానీ ఆమెను పుట్టింట్లో ఉంచలేని నిస్సహాయ స్థితి స్వామిది. ఇలాంటి సమయంలో ఆమెకు ఒక్కసారిగా నొప్పులు రావటం మొదలయ్యాయి. దింతో స్వామికి దిక్కుతోచలేదు. భార్యను పొలం గట్టుపై కొబ్బరి మట్టలపై పడుకోబెట్టి పరుగు పరుగున గ్రామంలోకి వెళ్ళాడు.
భార్య పురిటి నెప్పులు చూడలేక వైద్య సహాయం కోసం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా గ్రామంలోకి స్వామి చేరుకున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. పొట్టకూటి కోసం చిన్నచిన్న పనులు చేస్తూ సంచారం జీవితం. నిండు గర్భంలో నెలలు నిండినా పని చేయాల్సందే. అటువంటి పరిస్థితిలో ప్రాణాలను లెక్క చేయకుండా పోలం వెళ్ళిన నాంచారమ్మ చివరకు పొలం గట్టుపైనే ప్రసవించాల్సి వచ్చింది. ఈ దయనీయమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన గంధం స్వామి, నాంచారమ్మ దంపతులు బాతులు మేపుతూ సంచార జీవితం గడుపుతున్నారు. ఇటీవలే మత్స్యపురి ప్రాంతానికి వచ్చారు. కోఠానిమెరక ప్రాంతంలో బాతులు మేపుతుండగా నాంచారమ్మకు పురిటినొప్పులు మొదలయ్యాయి. పురిటినొప్పులతో విలవిలలాడింది నాంచారమ్మ. భార్య బాధను చూచి విలవిలలాడిపోయాడు భర్త స్వామి. వైద్య సహాయం కోసం పరుగులు తీసి స్థానికులను ఆరా అడిగాడు. అంతలోనే ప్రసవం అయిపోయింది. పండంటి ఆడబిడ్డ పుట్టింది. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది గోడి చినితల్లి, రాజశేఖర్, శిరీషలు ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించారు. బొడ్డు తాడును కత్తిరించారు. అంబులెన్సులో తల్లి బిడ్డలను వీరవాసరం పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్, మొహసినాతాజ్‌లు వైద్యం అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాక ఇంటికి పంపుతామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




