Andhra Pradesh: మా స్థలంలో లంకేబిందెలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి లేఖ.. షాక్ అయిన అధికారులు..!
Andhra Pradesh: సాధారణంగా స్థలం వివాదంలోనో, పొలం గొడవలోనో లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదనో కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వస్తుంటాయి.
Andhra Pradesh: సాధారణంగా స్థలం వివాదంలోనో, పొలం గొడవలోనో లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదనో కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే రెండు వారాల క్రితం పల్నాడు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదుతో అధికారులే ఖంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మా స్థలంలో లంకే బిందెలు ఉన్నాయి పురవస్తుశాఖ ద్వారా తవ్వించండి అంటూ ఓ మహిళ సాక్షాత్తు గ్రీవెన్స్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన దిల్షాద్ బేగం అనే ముస్లిం మహిళ తన పూర్వికుల స్థలం కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానం పక్కన గల బజారులో ఉన్నదని సదరు స్థలంలో లంకేబిందెలు ఉన్నట్లు తనకు తెలిసిందని స్వయంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
కారంపూడి తన స్వగ్రామం అని, అత్తగారిది గుంటూరు అని ఆ స్థలం తన పూర్వికులదని, ప్రభుత్వం చొరవచూపి తవ్వకాలు జరిపితే లంకేబిందెలు దొరికే అవకాశం ఉందని ఆమె లేఖలో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై విచారణ జరపవలసిందిగా కారంపూడి తహసీల్దార్ జె. ప్రసాదరావు ను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులో వాస్తవమెంత, స్థలం వివాదం ఏమైనా ఉందా, ప్రస్తుతం ఆ స్థలం ఎవరి ఆధీనంలో ఉంది అన్న అంశాలపై స్పష్టత కోరినట్లు తెలుస్తుంది. అయితే స్థానికుల వాదన మరోలా ఉంది. ప్రస్తుతం ఆ స్థలంలో మదర్సా ఉందని పదిమంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు. స్థల వివాదం కోర్టు పరిధిలో ఉందని ఈ క్రమంలోనే లంకె బిందెల ఉన్నాయన్న అంశం ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తి చేసిన రెవిన్యూ అధికారులు పురావస్తు శాఖకే ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు.
-టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.