Andhra News: వివాహాలు, వివాహేతర సంబంధాలు.. చివరకు విషాదంగా మారిన ఓ మహిళ కథ..
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే.. ఆమె ఇంటికి వచ్చిన యువకులు ఎవరు..? మల్లికను చంపింది వారేనా... అయితే ఎందుకు చంపారు..? అంతకు ముందు ఏం జరిగింది..? మల్లిక హత్య గురించి పోలీసులు ఏం చెబుతున్నారు.. ఇవన్నీ ప్రస్తుతం గుంటూరులో హాట్ టాపిక్ గా మారాయి..
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూర్ లోని భాస్కర్ నగర్.. మధ్యాహ్న సమయం కావడంతో కాలనీ అంతా నిర్మానుష్యంగా ఉంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి మల్లిక ఇంటిలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఎలా వచ్చారో.. అలానే వెళ్లిపోయారు ఆ ఇద్దరు యువకులు.. అయితే ఇంట్లో మల్లిక మాత్రం చనిపోయి ఉంది. దీంతో వచ్చిన యువకులు ఎవరు..? మల్లికను చంపింది వారేనా… అయితే ఎందుకు చంపారు..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మల్లిక హత్య గురించి తెలిసిన వెంటనే పెదకాకాని పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరుకు చెందిన మల్లిక పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అక్బర్ ను వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం… అయితే ఇద్దరూ పిల్లులు కలిగిన తర్వాత.. మల్లిక ప్రేమ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం అక్బర్ కు తెలియడంతో అతనికి విడాకులు ఇచ్చి పిల్లలని వదిలేసి ప్రేమ్ కుమార్ తో వెళ్లిపోయింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది. ప్రేమ్ కుమార్‌తో కాపురం చేస్తున్న సమయంలోనే బంగారం వ్యాపారి రెహమాన్ పరిచయం అయ్యాడు. రెహమాన్ తో పరిచయం కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్, మల్లిక పెంచుకునేందుకు ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకున్నారు. దీంతో రెహమాన్ ఐదు లక్షల వరకూ ఖర్చు చేసి ఒక పాపను కానుకగా ఇచ్చాడు. కొద్దీ రోజులు గుంటూరులోనే ఉన్న ప్రేమ్ కుమార్, మల్లిక కొద్దీ రోజులు క్రితం తిరిగి నంబూరుకు కాపురాన్ని మార్చారు.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే కాపురాన్ని నంబూరుకు మార్చిన తర్వాత మల్లిక మరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొంది. ఈ విషయం రెహమాన్ కు తెలిసింది. దీంతో అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టింది. దీంతో రెహమాన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మల్లికను హత మార్చాలని నిర్ణయించుకున్నాడు. అతనే ఇద్దరూ యువకుల్ని పంపించి హత్య చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అసలైన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..