పెద్దల్ని ఎదిరించిమరీ ప్రేమ పెళ్లి.. 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే భర్త పీక కోసి చంపేసింది!
అనుమానం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న దాంపత్య బంధం విషాదాంతమైంది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య దారుణానికి పాల్పడిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో సంచలనంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

అనకాపల్లి, ఆగస్ట్ 16: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతులు. ఇందిర స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉండగా, ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడు. వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానం ఇందిరలో కొంతకాలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని సమాచారం. ఈ క్రమంలో శనివారం అనకాపల్లిలోని కుమార్తె ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో పట్టరాని కోపానికి గురైన ఇందిర కత్తితో భర్తపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వెంకటరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల ఎదుట లొంగిపోయిన భార్య
భర్తను హత్య చేసిన అనంతరం ఇందిర మృతదేహం వద్ద తలవైపు దీపం పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంకటరావు, ఇందిర ఇద్దరూ చోడవరం ప్రాంతానికి చెందినవారేనని, వీరిది ప్రేమ వివాహమని బంధువులు తెలిపారు. అప్పట్లో పెద్దలు వివాహానికి అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, దంపతుల మధ్య గతంలో జరిగిన వివాదాలు, అనుమానానికి సంబంధించిన అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల దాంపత్య జీవితం అనుమానం, కోపం కారణంగా విషాదంగా ముగియడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
