బెజవాడ మెట్రో పట్టాలెక్కేనా?
మెట్రోరైలు.. భూమికీ ఆకాశానికి మధ్య హాయిగా సాగిపోయే అద్భుతమైన ప్రయాణం. ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతోంది. విభజన హామీల ప్రకారం ఏపీకి కూడా మెట్రో కేటాయించారు. కానీ ఆప్రాజెక్టు ఇంకా మీనమేషాలు లెక్కించే దశలోనే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుపై గత సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రకటనలు చేశారు. ప్రస్తుతం విజయవాడ మెట్రో రైలు మరోసారి ప్రస్తుతం వార్తలకెక్కింది. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే […]
మెట్రోరైలు.. భూమికీ ఆకాశానికి మధ్య హాయిగా సాగిపోయే అద్భుతమైన ప్రయాణం. ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతోంది. విభజన హామీల ప్రకారం ఏపీకి కూడా మెట్రో కేటాయించారు. కానీ ఆప్రాజెక్టు ఇంకా మీనమేషాలు లెక్కించే దశలోనే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుపై గత సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రకటనలు చేశారు. ప్రస్తుతం విజయవాడ మెట్రో రైలు మరోసారి ప్రస్తుతం వార్తలకెక్కింది. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న విజయవాడ నగరంలో మెట్రో కూత వినపించనుందా? ఈ ప్రాజెక్టుపై కొత్త సీఎం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది అసక్తిగా మారింది.
విజయవాడ మెట్రో ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించింది గత ప్రభుత్వం. అదే సమయంలో ఈప్రాజెక్టుకు కేంద్రం కూడా హామీ ఇచ్చింది. అయితే విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డ కొత్త రాష్ట్రంగా పరిగణించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 40 శాతం భాగస్వామ్యం,60 శాతం రుణ భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. దీనికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) వైస్ ఛైర్మన్ శ్రీధరన్ ను మెట్రో సలహాదారుగా నియమించింది. అయితే వీరి స్టడీలో విజయవాడకు మెట్రో ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి రూ. 7,500 కోట్లతో ఏలూరు, బందరు రోడ్ల కారిడార్ లకు 27 కిలోమీటర్ల మేర డీపీఆర్ కు ఓకే చెప్పారు. దీనికి వెంటనే టెండర్లు పిలిచినా వాటిని టెక్నికల్ కారణాలలో రద్దు చేశారు. రెండోసారి అనేక సంస్ధలు బిడ్లు వేసినా చివరికి రెండే మిగిలాయి. అవి ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్ధలు. అయితే అనూహ్య పరిణామాల మధ్య రెండు సంస్ధలు వేసిన టెండర్లను కూడా రద్దు చేసింది. మరోసారి రీ టెండర్లు పిలిచే లోపుగానే ప్రభుత్వం మీడియం మెట్రో ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే దీనిపై మరింత అధ్యయనం చేయాలని సూచిస్తూ అమరావతి రైల్ కార్పొరేషన్( ఏఎంఆర్ సీ), ఎంఏయూడీ లకు బాధ్యతను అప్పగించింది.
ఆ తర్వాత విజయవాడ నగరానికి లైట్ మెట్రో సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన డీపీఆర్ కు గ్లోబల్ టెండర్లను పిలిచారు. ఈ టెండర్లలో శిస్ట్రా అనే సంస్ధకు టెండర్లు దక్కాయి. ఈ సంస్ధ డీపీఆర్ తయారు చేసింది. అయితే దీని విలువ రూ. 20 వేల కోట్లు. వీరి లెక్కల ప్రకారం దాదాపు మొత్తం 80 కిలోమీటర్ల కారిడార్ కు అంచనాలు రెడీ చేసారు. అయితే వీటిమీద నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపధ్యంలో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై కొత్త సీఎం సమావేశం జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను, టెండర్లను మళ్లీ పరిశీలిస్తామంటున్న తరుణంలో మెట్రో ప్రాజెక్టు విషయంలో కూడా అదే ధోరణిలో వెళ్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎప్పటికి పట్టాలెక్కుతుందో.. చూడాలి.