
ఉత్తరాంధ్రలో టీడీపీ పేరు చెప్పగానే వినిపించి, కనిపించే నేతలలో బండారు సత్యనారాయణ మూర్తి ఒకరు. వైసిపి అంటేనే ఒంటికాలి మీద లేచే ఈ నాయకుడు తాజాగా టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారు. కుటుంబం అంతా తెలుగుదేశం పంచన ఉన్నా టీడీపీ తనను ఎక్కడా అకామిడేట్ చేయలేకపోవడంతో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. అదే సమయంలో వైసీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం బండారు సరైన అభ్యర్ధి అవుతారన్న ఆలోచన కూడా చేయడంతో బండారు వైసీపీ నాయకులకు టచ్‌లో ఉన్నారు. ఒక్కరే కాకుండా తనలాగే టికెట్ దక్కని ఐదు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను తీసుకుని మరీ వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. అసలు ఆయన జగన్ వైపు ఎందుకు చూడాల్సివచ్చింది.
టిడిపి స్టాల్ వార్ట్స్లో బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైన ఈ నేత 1989, 94, 99 లో పరవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉత్తరాంధ్ర టిడిపిలో కీలకంగా వ్యవహరించి ఉన్నారు. ఆ తర్వాత 2004లో పరవాడ నుంచి ఓడిపోయినా డీలిమిటేషన్ తర్వాత పెందుర్తిని తన కార్యక్షేత్రంగా మార్చుకొని అక్కడి నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2009లో పెందుర్తిలో ఓడిపోయినా, 2014లో అక్కడి నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2019లో ఓటమిపాలైనా అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి రాష్ట్ర నాయకుడిగా క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా ముందుండి పార్టీ జెండాని భుజాన వేసుకొని ఆక్టివ్‌గా పాల్గొన్న నేతల్లో బండారు ఒకరుగా గుర్తింపు పొందారు. ఇటీవల మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం గుంటూరు కోర్టులో హాజరుపరిచిన వైనం అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో రాష్ట్ర పార్టీ మొత్తం ఏకమై బండారు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించింది కూడా. అలాంటి బండారు టిడిపిని వీడుతారంటే అస్సలు నమ్మలేని పరిస్థితి టిడిపితో పాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా షాక్‌లో ఉన్నాయి.
కానీ ఈసారి పొత్తులో భాగంగా పెందుర్తిని జనసేనకి కేటాయించడం బండారుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో బండారుకి ప్రత్యామ్నాయ నియోజకవర్గం చూపకపోవడంతో పాటు టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడంతో కొన్నాళ్లపాటు బండారు తీవ్రంగా మదనపడ్డారు. ఆ తర్వాత తనలాగే టికెట్ దక్కని ఎలమంచిలి, చోడవరం, మాడుగుల విశాఖ సౌత్, అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి సమావేశం అయ్యారు. అవసరమైతే రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోవాలని ఆలోచించారట. టికెట్ల కేటాయింపు విషయంలో సీనియార్టీని, లాయల్టీని దృష్టిలో పెట్టుకోకుండా పెందుర్తి లాంటి సీట్లని జనసేనకి ఎలా కేటాయిస్తారని బండారు అనుచరులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జనసేనకి ఇవ్వాల్సి వస్తే కాపు ఆధిక్యత ఉన్న భీమిలి, చోడడరం లాంటి నియోజకవర్గాలు ఇచ్చే అవకాశం ఉన్నా కనీసం ఆ దిశగా చర్చలు కూడా జరగకుండా పెందుర్తిని అడిగిన వెంటనే ఇవ్వడం మా నాయకత్వాన్ని అవమానించినట్లుగా ఉందన్నది బండారు అనుచరుల ఆవేదన. బండారు నాయకత్వాన్ని అవసరం లేదని పార్టీ అనుకుంటే బండారు కూడా ఎందుకు పార్టీని పరిగణలోకి తీసుకోవాలని, ఎందుకు ఇంకా పార్టీకి లాయల్‌గా ఉండాలి అంటూ అనుచరులు కొద్దిరోజులుగా హడావిడి చేస్తూ వస్తున్నారు.
అదే సమయంలో బండారుకు టికెట్ ఇవ్వలేకపోయినా ఆయన కుటుంబంలో ముగ్గురికి ఇచ్చామని ఈసారికి బండారు సర్దుకుపోకతప్పదని టిడిపి చెప్పడం కూడా ఆయన అనుచరులకు మింగుడుపడడం లేదు. బండారు సత్యనారాయణమూర్తి అల్లుడు అయిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి శ్రీకాకుళం ఎంపీగా, ఆయన బాబాయ్ అచ్చం నాయుడు టెక్కలి నుంచి, ఎర్ర నాయుడు కుమార్తె భవాని భర్త ఆదిరెడ్డి వాసుకి రాజమండ్రి అర్బన్ నుంచి అవకాశం కల్పించామన్నది టిడిపి వాదన. అయితే కుటుంబ బాంధవ్యాల నేపథ్యం వేరని మేము వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళకముందు నుంచే రాజకీయాల్లో ఉన్నామని 7 సార్లు వరుసగా పోటీ చేస్తూ వస్తున్న నాయకుడిని పక్కనపెట్టి, దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చామనడం మోసగించడమేనని, బండారు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే వాళ్లకి ఇచ్చాం కదా సర్దుకు పొమ్మండం మరింత ఆవేదనకి ఆందోళనకి గురిచేసింది అన్నది అనుచరుల మాట.
ఈ నేపథ్యంలో బండారు వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారన్న వార్త ఒక్కసారిగా బయటికి వచ్చింది. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఒక్కదాన్నే పెండింగ్‌లో ఉంచి మిగతా 24 పార్లమెంట్ 175 అసెంబ్లీ స్థానాలన్ని ప్రకటించిన వైసిపీ అనకాపల్లి ఎంపీగా తనకు అవకాశం ఇస్తే విజయం సాధిస్తానని బండారు వైసిపి నేతలకి టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం. వైసీపీ కూడా అంతే పాజిటివ్‌గా స్పందిస్తూ.. బండారు లాంటి సీనియర్ నేత వైసీపీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వచ్చన్న ఆలోచన కూడా చేస్తోందట. ఎలాగో అది బిజెపికి ఇస్తే అక్కడ నుంచి సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉందని, అదే సమయంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ నేతగా ఉన్న బండారు సత్యనారాయణ స్థానికుడు కూడా అవుతుండడంతో స్థానికత నేపథ్యంలో బండారుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైసిపి భావిస్తుందట. ఆ మేరకు బండారుతో చర్చ జరుగుతుందట. అదే సమయంలో బండారు కూడా టిడిపిలో టికెట్ రాని ఐదు నియోజకవర్గాల ఇన్చార్జిలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. వారందరినీ కూడా వైసిపిలోకి తీసుకెళ్లి మంచి అవకాశాలు, హామీలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారట. దీంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర రాజకీయం ఊపందుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..