Andhra Pradesh: ఊరంతా నిర్మానుష్యం.. పశువులతో సహా మాయం.. అసలు ఏమిటీ చిత్రం..?
AP News: ఊరు మొత్తం ఎందుకు ఖాళీ అయింది. ఏమైనా విపత్తు వచ్చిందా.. లేదా ఊర్లో ఏదైనా దెయ్యం, భూతం వారిని భయపెట్టిందా.. అసలు ఆ ఊరికి ఏమైంది..
Anantapur district: ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది.. పిల్లపాపలు, ముసలి ముతక, పశువులు, కోళ్లు, కుక్కలు ఇలా ఏవీ లేవు అన్నింటినీ తీసుకుని అందరూ కలసి ఊరు వదిలి వెళ్లిపోయారు. గ్రామానికి కొంత దూరంలో ఉన్న దర్గా వద్ద.. పిల్లా జల్లా అంతా అక్కడే వంటా వార్పులు చేసుకున్నారు. అదేంటి ఊరు మొత్తం ఎందుకు అయింది. ఏమైనా విపత్తు వచ్చిందా.. లేదా ఊర్లో ఏదైనా దెయ్యం, భూతం వారిని భయపెట్టిందా.. అసలు ఆ ఊరికి ఏమైంది.. తెలుసుకుందాం పదండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం(Tadipathri Mandal) తలారిచెరువు(Talaricheruvu) గ్రామానికి సుమారు 600 ఏళ్ల నుంచి ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మాఘ మాసం పౌర్ణమి రోజు అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్థులు తమ కుటుంబ సభ్యుల, పెంపుడు జంతువులతో కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్తారు. పిల్లాపాపలు, ముసలివారు, పశువులతో సహా తీసుకుని ఊరికి దూరంగా వెళ్తారు. మరుసటి రోజు తమ ఇళ్లకు చేరుకుంటారు. గ్రామంలో ఎలాంటి అగ్గి గాని, వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణంవైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లి ఒక రోజు గడుపుతారు. మాఘపౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గిగాని, లైట్లుగాని వెలిగించరు.
అసలు ఎందుకీ ఆచారం.. ఎప్పటి నుంచి కొనసాగుతోంది..
600 సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని, ధనాన్ని దోచుకుని వెళ్తుండగా.. గ్రామస్తులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండరాదని.. పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ.. కరవు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించారట. అప్పటి నుండి గ్రామంలో పంటలు పండక, పుట్టిన బిడ్డలు మరణిస్తున్నారు. దీంతో గ్రామస్థులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణానికి వెళ్లి అక్కడి స్వాములోరిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఆ పండితుడు గ్రామంలోని వారు మాఘచతుర్థదశి అర్ధరాత్రి నుండి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఊరు విడిచి వెళ్లాలని సూచించారట. ఆ ఆచారం ప్రకారం వారు.. మాఘ పౌర్ణమి రోజున ఊర్లోని వారందరూ గ్రామాన్ని ఖాళీ చేసి, సమీపంలోని హాజివలి దర్గాలో నిద్ర చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వంటావార్పు చేసుకుంటారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు సైతం వచ్చి, ఈ ఆచారాన్ని పాటిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో గడుపుతారు. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకుని, ఇంటిని శుభ్రం చేసుకుని, దినచర్యను ప్రారంభిస్తారు. అర్ధరాత్రి వరకు లైట్లు కూడా వెలిగించరు.
6 వందల ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని మధ్యలో కొందరు ఎందుకు పాటించాలని అతిక్రమించారని.. ఆ తరువాత గ్రామంలో వరుసగా అశుభాలు జరిగాయని గ్రామస్థులు అంటున్నారు. మొత్తం మీద ఒక ఆచారాన్ని 6శతాబ్ధాల నుంచి కొనసాగిస్తుండటం ఆశ్చర్యకరమే.
—-లక్ష్మీకాంత్, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా
Also Read: ఇంటి బేస్‌మెంట్ కింద రహస్య అర.. అందులోకెళ్లి చెక్ చేసిన పోలీసులు షాక్