APPSC ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ.. తెలంగాణ, ఏపీ నుంచి టాప్-9 తాజా వార్తా విశేషాలు
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారన్న అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి లేటెస్ట్ వార్తా విశేషాలు.
AP and Telangana News: ఆంధ్ర ప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి బాధ్యతలు స్వీకరించగా.. అటు గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. మేడారం జాతర ఇవాళ్టితో ముగియనుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం పీసీసీలో హాట్ టాపిగ్‌గా మారింది. ఇలాంటి టాప్9 వార్తా విశేషాలు చూద్దాం..
- APPSC చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు గౌతమ్ సవాంగ్. సదరు ఫైల్‌పై సంతకం చేశారు. గౌతమ్ సవాంగ్‌కు నూతన డీజీపీ కంగ్రాట్స్ చెప్పారు. ఇటు.. ఏపీ నూతన డీజీపీగా చార్జ్ తీసుకున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి.
- అనంతపురం జిల్లా హిందూపురం మనేసముద్రంలో దారుణం జరిగింది. భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. రెండు సంవత్సరాలుగా కాపురానికి రాలేదని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు భర్త. అత్త ఇంటికి వెళ్లి ప్లాన్ ప్రకారం భార్య పవిత్రను హతమార్చాడు భర్త శ్రీనివాస్.
- కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వత్సవాయి మండలం లింగాల శివారు ప్రాంతాల్లో కిరాతకంగా నరికి చంపారు దుండగులు. బీజేపీ నేత మల్లారెడ్డి మృతదేహాన్ని పంటపొలల్లో గుర్తించారు పోలీసులు.
- కాంగ్రెస్‌లో రెబల్‌స్టార్‌గా పేరున్న జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న వార్త తెలంగాణ పీపీసీలో హాట్ టాపిక్ అయింది. జగ్గన్న చేయిజారిపోతున్నారన్న వార్త వినగానే…కాంగ్రెస్ పెద్దలు ఆగమేఘాలమీద బుజ్జగింపులకు బయలుదేరారు. వీహెచ్ సహా పలువురు నేతలు మంతనాలు జరుపుతున్నారు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందిస్తున్నారు. జగ్గారెడ్డిని పార్టీలోనే ఉంచేందుకు కృషి చేస్తామన్నారు CLP నేత భట్టి విక్రమార్క. ఇప్పటికే ఆయనతో మాట్లాడానని, సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని చెప్పానన్నారు. త్వరలోనే పార్టీ హైకమాండ్‌ను కలుస్తానన్నారు.
- బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధిక వ్యయంతో ఉక్కు ఉత్పాదన చేయాల్సిన పరిస్థితి లేదనీ.. అందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు.
- మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. శనివారం రాత్రి సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో నాలుగు రోజుల జాతరకు తెరపడనుంది. నేడు సమ్మక్క సారలమ్మ దేవతలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకోనున్నారు.మేడారం జాతర అద్భుతంగా జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన ఆదివాసీ సంఘాలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గిరిజన పండుగపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎర్రబెల్లి.
- మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అటు మేడారం జాతరలో పోలీసులు, ఆదివాసీల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ఆదివాసీ పూజారులపై పోలీసుల దురుసు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. సారలమ్మ పూజారిని అడ్డుకోవడమేంటని మండిపడుతున్నారు. పోలీసుల టెంట్లు కూల్చివేసి ఆందోళనకు దిగారు.
- నారాయణపేట జిల్లా మద్దూరులో అమానుష ఘటన జరిగింది. దివ్యాంగ బాలికపై అత్యాచారం చేసి.. ఒంటికి నిప్పంటించాడు నిందితుడు వెంకట్రాములు. స్థానికులు బాధితురాలిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక.. చికిత్స పొందుతూ చనిపోయింది.
- నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన బీజేపీ నేతల్ని.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రెండువర్గాలను చెదరగొట్టారు.
Also Read..
Bihar Massive Fire: మధుబని రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న రైలులో మంటలు..!
Telangana crime: వ్యక్తిని చితకబాదిక ఎస్సై.. రక్తం వచ్చేలా బెల్టుతో దాడి.. చర్యలకు ఎస్పీ ఆదేశం