Monsoon: తొలకరి జల్లు నేలను తాకేదెప్పుడు? రైతుల కళ్లలో ఆనందం ఎప్పుడు?
నైరుతి ముందుకు కదలడం లేదు.. తొలకరి ఇంకా పలకరించనూ లేదు. జూన్ నెల సగం పూర్తైనా ఎందుకీ పరిస్థితులు ? ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా రుతుపవనాలు విస్తరించకపోవడానికి కారణం ఏంటి? తొలకరి జల్లు నేలను తాకేదెప్పుడు? రైతుల కళ్లలో ఆనందం ఎప్పుడు?
ఏటా జూన్ మాసం వచ్చిందంటే చాలు.. మొదటి వారం నుంచీ వాతావరణం మారిపోతుంది. రుతుపవనాల రాకతో చల్లబడటమే కాకుండా.. తొలకరి పలకరింపుతో రైతులు ఉత్సాహంగా ఉండేవాళ్లు. కానీ ఈ ఏడాది భిన్నపరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయ్.. ఇప్పటికీ చినుకు జాడ లేదు. ఈ నెల 11నే ఏపీ సరిహద్దును రుతుపవనాలు తాకినప్పటికీ.. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించలేదు. ఏపీలోనే స్తంభించిపోయాయి. ఈనెల 19 నాటికిగానీ అవి తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది వాతావరణశాఖ.
సాధారణంగా జూన్ మొదటివారం ముగిసే నాటికి ఉష్ణోగ్రతలు తగ్గాలి. రుతుపవనాలు జూన్ 10న తెలంగాణను తాకాలి. అయితే ఈ ఏడాది వాటి రాక ఆలస్యమవడంతో 15వ తేదీలోపు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ అంచనా కూడా తప్పింది. ఇంకా రుతుపవనాలు విస్తరించనేలేదు. ఈ నెల 21వ తేదీ లోపు మద్యభారతంలో ప్రవేశించే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో వర్షాభావం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు రెండు కారణాలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు..
ఎల్‌నినో ప్రభావంతో.. మేఘాల కదలికలు నెమ్మదిగా ఉన్నాయి. మరోవైపు గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను కారణంగా తేమ గాలులు అటువైపు తరలిపోవడంతో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆగిపోయింది. అందుకే రుతుపవనాలు విస్తరించిన చోట కూడా సరైన వర్షాలు లేవంటోంది వాతావరణశాఖ. బిపర్జోయ్ తుఫాను ఈ నెల 18వ తేదీనాటికి పూర్తిగా బలహీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే రుతుపవనాలు పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. ఇంకో మూడు రోజుల తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సీజన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం