Pawan Kalyan: మోదీ సభకు పవన్ డుమ్మా.. రీజన్ అదే అంటున్న ఏపీ బీజేపీ లీడర్స్
అల్లూరి విగ్రహావిష్కరణకు వస్తున్న ప్రధానమంత్రి మోడీకి జనసేన తరపున స్వాగతం పలుకుతున్నామని చెప్పారు పవన్. ఈ కార్యక్రమానికి తమకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ మీటింగ్‌కు మాత్రం రాలేదు.
కమలంతో జనసేన(Janasena)కు దోస్తీ కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. మరి భీమవరం(Bhimavaram)లో మోదీ సభకు జనసేనాని ఎందుకు డుమ్మా కొట్టారు? అనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని చిరంజీవి(Chiranjeevi)తో పాటు పవన్‌నూ ఆహ్వానించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇద్దరిలో అన్నయ్య మాత్రమే వేడుకలకి వచ్చారు.. మరి తమ్ముడు ఎందుకు రాలేదన్న చర్చ నడుస్తోంది. పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో అల్లూరి విగ్రహం గ్రాండ్‌గా ఏర్పాటు జరుగుతుంటే ఎందుకు దూరంగా ఉన్నారు? ప్రధాని మోదీతో వేదిక పంచుకోకుండా ఎందుకు రాకుండా ఉన్నారు? బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నారా? అందులో భాగంగానే వేడుకలకి రాలేదా అన్న చర్చ నడుస్తోంది. ఇక ఆహ్వానానికి సంబంధించి పవన్ ముందు రోజే స్పందించారు. అల్లూరి విగ్రహావిష్కరణకు వస్తున్న ప్రధానమంత్రి మోడీకి జనసేన తరపున స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి తమకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించాలని నాయకులకు సూచించినట్లు పవన్ తెలిపారు. కానీ మనిషి మాత్రం వేడుకలకి హాజరుకాలేదు. ఎందుకిలా అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దు. ప్రతిపక్షాలు ఒక్కటిగా ఫైట్ చేయాలని సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ స్టేట్‌మెంట్ ఇస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం జనసేన మినహా మరే ఇతర పార్టీతో వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని సభకు దూరంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్‌తో వేదిక పంచుకోవడం ఇష్టం లేక పవన్ వేడుకలకి హాజరుకాలేదా? లేదంటే బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోయారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో హాజరుకాలేనని పవన్ చెప్పినట్లు బీజేపీ నేత సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.