Andhra Pradesh: ప్రధాని ఏపీ పర్యటనలో సంచలనం… మోదీ హెలికాప్టర్‌కు దగ్గరగా వెళ్లిన నల్ల బెలూన్లు..
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్‌లు ఎగరేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
తెలంగాణ(Telangana)లో ప్రధాని మోదీ(Pm Modi)కి నిరసనగా ఆయన హెలికాప్టర్ ప్రయాణించే సమయంలో నల్ల బెలూన్లు ఎగరవేయాలని కొందరు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారి ప్లాన్‌ను భగ్నం చేశారు. కానీ ఏపీలో మాత్రం ఊహించని విధంగా ప్రధాని భీమవరం(Bhimavaram) వెళ్లే క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్ల బెలూన్లు గాల్లోకి వదిలారు. అవి మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు దగ్గరిగా వెళ్లాయి. కేసరిపల్లిలో ఈ బెలూన్లు వదిలినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ తరహా నిరసన చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాన్ని సెక్యూరిటీ పరంగా సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. అటు ఎస్పీజీ సైతం అలెర్ట్ అయ్యింది. ఎవరు బెలూన్స్ వదిలారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాజీవ్‌రతన్ నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో గన్నవరం విమానాశ్రయంలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులు పట్టుకుని గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతుల్లో ఉన్న నల్ల బెలూన్లను పగలగొట్టి, ప్రధాన గేటు వద్ద కూర్చొని నిరసనకు ప్రయత్నించారు.