Andhra News: డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. నిందితులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
ఈజీ మనీ కోసం అలావాటు పడిన కేటుగాళ్లు జనాను మోసం చేసేందుకు రోజుకో కొత్త రకం వ్యూహాలను పన్నుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని వాడుకొని జనాల ఖాతాల్లోని డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వీటిపై ఫోకస్ పెట్టిన పోలీసులు విజయనగరం జిల్లాలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల భరతం పట్టారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో పెద్దఎత్తున చోటు చేసుకున్న సైబరు మోసాన్ని పోలీసులు చేధించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకున్న నలుగురు ప్రధాన నిందితులను బొబ్బిలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొబ్బిలి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింత రమణకు సైబరు నేరగాళ్లు 2025 సెప్టెంబర్ 15న వాట్సాప్ కాల్ చేశారు. తాము సీబీఐ అధికారులమని, మీ ఆధార్ కార్డు మానవ అక్రమ రవాణాలో ఉపయోగించబడిందని, మీరు నేరాలకు పాల్పడ్డారు కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. విడుదల చేయాలంటే పూచీకత్తు కోసం కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వారి మాటలకు భయపడ్డ టీచర్ వెంకట రమణ దశలవారీగా మొత్తం రూ.22,18,000లు మోసగాళ్ళకు ముట్టచెప్పారు. అయితే ఎన్నిసార్లు ఇచ్చినా మళ్లీ మళ్లీ డబ్బు కోసం బెదిరిస్తుండటంతో అనుమానం వచ్చిన వెంకటరమణ అక్టోబర్ 9న బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఎట్టకేలకు ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు చెన్నైకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిధులను సునీల్ సుతార్ (23), సతీష్ (19), రాజేష్ పాల్ (26), మహ్మద్ ఇర్ఫాన్ (21)లుగా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడు వినోద్ చౌదరితో కలిసి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రస్తుతం వినోద్ చౌదరి పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ కేసులో నిందితుల ఖాతాల్లో జమ అయిన రూ.22 లక్షల మొత్తాన్ని ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీబీఐ, పోలీసు లేదా న్యాయమూర్తుల పేరుతో వీడియో కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు చేధించడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ భవ్య రెడ్డి, సీఐ సతీష్‌లను ఎస్పీ ప్రశంసించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




